ఐపిఎల్‌.. మ్యాచ్‌లన్నీ ఒకే నగరంలో?

న్యూఢిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపిఎల్‌)-2021 సీజన్‌ తొలి అంకం అయిన ఆటగాళ్ల వేలం పాట ఇటీవలే గ్రాండ్‌గా పూర్తయింది. కానీ ఐపిఎల్‌ నిర్వహన వేదికలు, షెడ్యూల్‌పై స్పష్టత రాలేదు. దీనికి ప్రధాన కారణం దేశంలో కరోనా మహమ్మారి పూర్తి స్థాయిలో కట్టడి కాకపోవడమే కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే దేశంలో కరోనా కేసులు నమోదు అవుతుండటం, కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రభావం ఐపిఎల్‌ షెడ్యూల్‌ పై పడింది. దీనికి తోడు దేశంలోని పలు ప్రాంతాల్లో ఇంకా కరోనా ఆంక్షలు, విదేశీ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతోంది. అయితే, 2021 ఐపిఎల్‌ సీజన్‌ను ఒకే నగరానికి పరిమితం చేస్తూ.. మూడు వేదకల్లో నిర్వహించడానికి బిసిసిఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదా? ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) మాదిరిగా ఐపిఎల్‌ నిర్వహించడానికి సిద్ధమవుతోందా? అంటే క్రీడా వర్గాల్లో అవుననే సమాధానం వినిపిస్తోంది. ఐపిఎల్‌ వేదికలు, షెడ్యూల్‌పై స్పష్టత ఇవ్వకపోవడానికి ఒకే నగరం వ్యూహమే కారణమని ప్రస్తుతం క్రీడా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

11 ఫుట్‌బాల్‌ జట్లు పాల్గొంటున్న ఐఎస్‌ఎల్‌ ప్రస్తుత సీజన్‌ను గోవాలోని మూడు స్టేడియాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇదే వ్యూహాన్ని ఐపిఎల్‌కు కూడా అనుసరించాలని బిసిసిఐ భావిస్తున్నదట. కరోనా ఒక కారణం కాగా, వేరువేరు నగరాల్లో బయోబబుల్‌ ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఒకే నగరంలో నిర్వహిస్తే ఖర్చుల తక్కువ కావడంతో పాటు ప్రయాణాలు చేయాల్సిన పని ఉండదని బిసిసిఐ భావిస్తున్నదట. అందుకే 2021 ఐపిఎల్‌ను ముంబయిలోని బ్రబౌర్న్‌, వాంఖడే, డీవై పాటిల్‌ స్టేడియాల్లో నిర్వహిస్తే ఎలా ఉంటుంది అనే వ్యూహంతో ముందుకు సాగుతున్నదని సమాచారం.