దేవినేనిపై కేసులు వేయడం దారుణం: చంద్రబాబు

దేవినేని ఉమపై కేసులు పెట్టడం చాలా దుర్మార్గమని, వైసిపి నాయకులే దాడి చేసి రివర్స్‌ కేసు పెట్టారని టిడిపి అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. శనివారం విజయవాడలోని గొల్లపూడిలో దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబసభ్యులను చంద్రబాబు పరామర్శించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ…కొండపల్లి బోమ్మలు తయారు చేసే చోట చెట్లను నరికేస్తున్నారని. పర్యావరణం దెబ్బతింటుందని ఉమాతో పాటు టిడిపి నేతలు అక్కడికి వెళ్లారని చెప్పారు. ఉమా పై హత్యాయత్నం కేసు పెట్టడం సిగ్గుచేటన్నారు. డిజిపి గౌతమ్‌ సవాంగ్‌ ఇలా చేయడం అన్యాయమన్నారు. పోలీసులు ఇంత నీచంగా ఎప్పుడూ పనిచేయలేదని దుయ్యబట్టారు. అక్రమ మైనింగ్‌ జరగకపోతే నిజనిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకున్నారు ? అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. సీనియర్‌ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల కొండపల్లి అటవీప్రాంతంలో దేవినేని ఉమ క్షేత్రస్థాయి పరిశీలన చేసిన విషయం తెలిసిందే. పర్యటన తర్వాత జరిగిన ఘర్షణల్లో ఉమపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించారు.