ఢిల్లీ అభివృద్ధిని అడ్డుకోవడం మోడీ తరం కాదు: సిసోడియా

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని అభివృద్ది చేయకుండా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అడ్డుకోవడం ప్రధాని మోడీ తరం కూడా కాదని ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా ఘాటు వ్యాఖ్యలు చేశారు. లెఫ్టినెంట్‌కు మరిన్ని అధికారాలను కల్పించే….దేశ రాజధాని ప్రాదేశిక చట్టం (జిఎన్‌సిటిడి) సవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంపై సిసోడియా మండిపడ్డారు. ప్రతి ఒక్కరు మోడీ మోడల్‌ గురించి మాట్లాడుతున్నారని, కానీ ప్రజలు మోడీ మోడల్‌ వైఫల్యం చెందడంపై మాట్లాడుకుంటూనే….దానికి ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అభివృద్ది గురించి మాట్లాడుతున్నారని, అది మోడీ సర్కార్‌కు కంటికి కునుకు లేకుండా చేసిందని పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్దిని అడ్డుకునేందుకు మోడీ సర్కార్‌ ఇటువంటి చర్యలకు దిగుతుందని, ప్రధానిగా మోడీ ఎక్కడైనా మంచి పనులు చేయవచ్చునని….కానీ ఆయన అలా చేయరని అన్నారు. కేజ్రీవాల్‌ చేస్తున్న అభివృద్ధిని తట్టుకోలేక.. మోడీసర్కార్‌ ఇటువంటి అడ్డంకులను ఏర్పాటు చేస్తుందని విమర్శించారు. కేజ్రీవాల్‌ యోధుడినా…వాటిని దాటుకుంటూ వస్తారని అన్నారు. ప్రధాని ప్రతికూల రాజకీయాలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి పాపులారిటీతో కేంద్రం భయాందోళనలకు గురౌతుందని విమర్శించారు.