ఐఏఎస్ అధికారులు, అధికార పార్టీ నేతల ఇళ్లకు వెళ్లి వారికి సన్మానం చేయడం సిగ్గుచేటు

  • దీనిని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకు వెళతాం
  • అధికార పార్టీతో ఉన్నతాధికారులు కలిసి జనసేన, టిడిపిలపై కుట్రలు పన్నుతున్నారా!
  • రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ లను ఉన్నఫలంగా ఎందుకు మారుస్తున్నారు..?
  • ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే మాకు గౌరవం..
  • మీరు అధికార పార్టీ నేతలకు ఊడిగం చేయకండి..

తిరుపతి సిటీ: తిరుపతిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఐఏఎస్ అధికారులు లక్ష్మీషా, అతిథి సింగ్ లు అధికార పార్టీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి కలవడం, సన్మానించడం వెనక ఆంతర్యం ఏంటని, కలెక్టర్, కమిషనర్ల వ్యవహార తీరును తప్పుపడుతూ.. జనసేన, టిడిపి నేతలు కిరణ్ రాయల్, ఊకా విజయ్ కుమార్లు శుక్రవారం మీడియా ముఖంగా ప్రశ్నించారు. ఒక మెజిస్ట్రేట్ హోదాలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి కలవడం స్థానిక ప్రజల్లో ఎన్నో అనుమానాలు కలగజేస్తున్నాయన్నారు. రేపు స్థానికంగా పోటీ చేసే అభ్యర్థులను కలిసి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తూ వారితో లాలూచీపడితే.. ప్రతిపక్ష నేతలు రానున్న ఎలక్షన్ ఎలా చేస్తారని, అధికార యంత్రాంగం ప్రతిపక్ష పార్టీలకు ఎలా సహకరిస్తుందని ప్రశ్నించారు. జనసేన, టిడిపి లీగల్ టీం సహాయంతో దీనిపై ఎలక్షన్ కమిషన్ దృష్టికి, చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళతామని వాపోయారు. రాష్ట్రంలో ఉన్న ఫలంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎందుకు మారుస్తున్నారని, ఇలాంటి చర్యలపై ఎలక్షన్ కమిషన్ దృష్టి సారించాలని కోరారు. దొంగ ఓట్లలో అవినీతికి పాల్పడ్డ ఐఏఎస్ అధికారిని గత కొద్దిరోజుల క్రితమే సస్పెండ్ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అంటే మాకు ఎంతో గౌరవం ఉందని, కానీ మీరు అధికార పార్టీ నేతలకు ఊడిగం చేయడం లాంటి వాటిని జనసేన, టిడిపి పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. రేపు తిరుపతిలో, రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళుతూ తనతో ఐఏఎస్ అధికారులను, పారిశ్రామికవేత్తలను వెంటబెట్టుకొని జైలుకు తీసుకువెళ్లారన్నారు. గత ఎన్నికలలో అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదుకు పాల్పడ్డారని, ఇప్పుడు కలెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐఏఎస్ అధికారులు వైసీపీ నేతలను కలవడం చూస్తుంటే ప్రతిపక్ష జనసేన, టిడిపి పార్టీలపై కుట్రలు పన్నుతున్నారేమోనని, ఇలాంటి చర్యలను దీటుగా ఎదుర్కొంటామని అధికార పార్టీ నేతలను సంబంధిత అధికారులను వారు హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో లీగల్ సెల్ న్యాయవాదులు విజయభాస్కర్, జనార్ధన్, జనసేన, టిడిపి నేతలు.. నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రఘు, గుట్టా నాగరాజు, రమేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.