జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు జనసేన కృషి

గుంటూరు: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, అణగారిన వర్గాల అభ్యున్నతికై జీవిత పర్యంతం పోరాడిన బాబూ జగజ్జీవన్ రామ్ ఆశయాలను ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. బాబూ జగజ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక హిందూ కాలేజీ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులకు మేనమామను అని చెప్పుకునే జగన్ రెడ్డి దళిత యువకుడికి శిరోముండనం చేసినప్పుడు, దళిత యువ డ్రైవర్ ని పాశవికంగా హత్య చేసి డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కరోనా సమయంలో మెడికల్ కిట్లు సరిగ్గా లేవని అన్నందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిని చేసి అతని చావుకు కారణమైంది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. దళితులకు అందాల్సిన 27 సంక్షేమ పధకాలను రద్దు చేసి దళిత ద్రోహిగా జగన్ రెడ్డి మిగిలిపోయారని నేరేళ్ళ సురేష్ ధ్వజమెత్తారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ బాబూ జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన దిశగా జనసేన పార్టీ ముందుకు సాగుతోందన్నారు. దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే రాజకీయ పార్టీలకు బుద్ధి వచ్చే విధంగా రాజ్యాధికారంలో దళితులను పవన్ కళ్యాణ్ భాగస్వామ్యం చేయనున్నారని పేర్కొన్నారు. నగర ఉపాధ్యక్షుడు కొండూరు కిషోర్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ జీవితాన్ని నేటి రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అణగారిన వర్గాలకు సమాజంలో సమానత్వం వచ్చే వరకు పోరాడిన జగజ్జీవన్ రామ్ పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కిషోర్ అన్నారు. కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు సూరిశెట్టి ఉదయ్, మెహబూబ్ బాషా , నాగేంద్ర సింగ్, సూదా నాగరాజు, పులిగడ్డ గోపి, పుల్లంసెట్టి ఉదయ్, బొడ్డుపల్లి రాధాకృష్ణ ఆషా, డివిజన్ అధ్యక్షులు జడ సురేష్, సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, మాదాసు శేఖర్, ఏడుకొండలు, పవన్ వెంకీ, కుమారస్వామి, కొనిదేటి కిషోర్, గోపి, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.