వారాహి యాత్రలో అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం ప్లాన్

• పెడన సభలో గొడవలు సృష్టించేందుకు ప్రణాళిక
• వారాహి విజయయాత్రను అడ్డుకోవడమే జగన్ లక్ష్యం
• జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు.. అప్రమత్తంగా ఉండండి
• కిరాయి మూకలు రాళ్ల దాడికి దిగినా సంయమనం పాటించండి
• ఎదురు దాడి చేయకుండా చుట్టముట్టండి
• కత్తులు, మారణాయుధాలు ఉంటే అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలిద్దాం
• మచిలీపట్నం జనవాణి అనంతరం మాట్లాడిన జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్

‘జనసేన చేపట్టిన వారాహి విజయ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోంది. అల్లరి మూకలతో గొడవలు సృష్టించి భయబ్రాంతులకు గురి చేయాలని, కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం ఉంది. నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం జరగబోయే పెడన నియోజకవర్గ వారాహి విజయయాత్ర సభలో రౌడీమూకలు, గూండాలు, అల్లరి మూకలను దించి సభపై రాళ్ల దాడి చేయించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సభలో ఎలాంటి అలజడులు సృష్టించినా దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంద’ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన అనంతరం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ‘‘వైసీపీ నాయకుడికి, డీజీపీకి, హోం మంత్రికి, పోలీస్ అధికారులకు స్పష్టంగా చెబుతున్నా.. పెడన సభలో కనుక ఏవైనా గొడవలు పెట్టుకోవాలని చూస్తే ఏ మాత్రం సహించేది లేదు. ఏం జరిగినా వారే పూర్తిగా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో జన సైనికులు, తెలుగు తమ్ముళ్ల కలయికను ఎలాగైనా చెడగొట్టేందుకు వైసీపీ దుష్ట పన్నాగాలు పన్నుతోంది. ఇరు పార్టీల మధ్య ఎలాగైనా చిచ్చు పెట్టాలని భావిస్తోంది. జనసేన, తెలుగుదేశం పార్టీల కలయికకు విఘాతం కలిగించేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీనే బాధ్యత వహించాలి. సభలో ఏ మాత్రం రాళ్ల దాడి జరిగినా, గూండాలు చెలరేగినా పోలీసులే వారిని నిలువరించాలి.
• పులివెందుల రౌడీయిజం సహించం
రాష్ట్రంలో పులివెందుల రౌడీయిజం చేయిస్తే సహించేది లేదు. క్రిమినల్ మైండ్ తో ఆంధ్రప్రదేశ్ లో గొడవలు సృష్టించాలని ముఖ్యమంత్రి చూస్తున్నారు. వారాహి విజయ యాత్ర సభలో ఎవరైనా అగంతకులు రాళ్ల దాడికి దిగినా జన సైనికులు, తెలుగు తమ్ముళ్లు ఎదురు దాడికి దిగవద్దు. రాళ్ల దాడి చేసే వారిని చుట్టుముట్టి పోలీసులకు అప్పగిద్దాం. అంతా కలిసి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్దాం. ఎవరైనా సభలో అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే వారిని పోలీసులకు అప్పగించండి. కత్తులు , మరణాయుధాలు తీసుకొచ్చే వారిని చుట్టుముట్టి బంధించండి. ఎట్టి పరిస్థితుల్లో ఎదురు దాడి చేయకండి. చుట్టుముట్టి బంధించిన వారందరినీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్దాం. ప్రతి ఒక్కరినీ చట్టానికి అప్పగిద్దాం. గతంలో అమలాపురం వారాహి విజయయాత్ర సందర్భంగా అక్కడ విధ్వంసం సృష్టించేందుకు కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నించింది. మళ్లీ ఇప్పుడు కూడా అదే పద్ధతిలో సుమారు రెండు, మూడు వేల మంది కిరాయి మూకలను తీసుకొచ్చే అవకాశం ఉందని నాకు సమాచారం ఉంది. ఏ మాత్రం ఏమరపాటు తగదు. అంతా అప్రమత్తంగా ఉండండి. జగన్ ఇలాంటి క్రిమినల్ వేషాలు వేస్తే సహించేది లేదు. అధికారం నుంచి దిగిపోతున్నామని తెలిసే, వైసీపీ నాయకుడు అల్లర్లు, గొడవలు రాష్ట్రంలో సృష్టించాలని చూస్తున్నాడు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. రాబోతున్న జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. బుధవారం జరిగే పెడన వారాహి విజయయాత్ర సభలో ఏం జరిగినా కచ్చితంగా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకోవాల్సిందే. రాష్ట్ర హోంమత్రి, డీజీపీ, ఇతర పోలీసు అధికారులు దీనికి బాధ్యత వహించాల్సిందే. మేం పూర్తిగా పోలీసులకు సహకరిస్తూ కార్యక్రమాలు చేసుకుంటాం. మాకు తగిన విధంగా వ్యవస్థలు సహకరిస్తాయని భావిస్తున్నాం’’ అన్నారు.