పోలీస్‌ అమరవీరులకు జగన్‌ నివాళి.. నిరుద్యోగులకు శుభవార్త..

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు జరగనున్నాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న సంస్మరణ దినోత్సవ సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తోపాటు హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. ఈ సందర్బంగా పోలీస్‌ అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తరువాత.. గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని.. వారి త్యాగం నుంచీ ప్రతీ పొలీసు చాలా నేర్చుకోవాలని అన్నారు. ప్రతీ సంవత్సరం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తాం అని హామీ ఇచ్చారు. నాలుగు దిక్కుల నుంచీ ఎటువంటి ఆపద వచ్చినా కాపాడే ధైర్యసాహసాలు ధర్మచక్రం చెపుతుందని అన్నారు.. అధికారం ఎంత గొప్ప బాధ్యతో సత్యమేవ జయతే అన్నది చెపుతుందని అన్నారు. ప్రజల బాగోగులకోసం పాటుపడిన ప్రతీ పోలీసు అమరవీరుడికి జేజేలు అన్నారు.

అంతే కాదు ఈ సందర్బంగా సీఎం జగన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేసి..జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్ జారీ చేస్తామన్నారు. నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తామని తెలిపారు. పోలీసు శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తామని పేర్కొన్నారు