బీసీల చేతిలో జగన్ రెడ్డికి రాజకీయ సంహారం తప్పదు

  • జిల్లా జనసేన అధికార ప్రతినిధి హరి

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంలో అన్నివిధాలా మోసానికి , దగాకి గురైన బీసీల ఆగ్రహ జ్వాలలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి రాజకీయ సంహారం తప్పదని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు కోవెలమూడి నాని ఆధ్వర్యంలో బీసీ నాయకురాలు గల్లా మాధవి నేతృత్వంలో జయహో బీసీ సభకై ఏర్పాటు చేసిన వాహనశ్రేణిని ఏర్పాటుచేశారు. వీటిని మంగళవారం శ్రీనివాసరావుతోటలో టీడీపీ, జనసేన జెండాలు ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశ చరిత్రలోనే ఇంతవరకు జరగని స్థాయిలో జరుగుతున్న జయహో బీసీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ సోదరులు పెద్దఎత్తున పాల్గొన్నారని తెలిపారు. గత ఎన్నికల్లో బీసీలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాక వారికి జగన్ రెడ్డి చేసిన ద్రోహం క్షమించరానిదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీ యువత, విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో బీసీలకు అగ్రపీటం వేసేందుకు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆళ్ళ హరి తెలిపారు. కార్యక్రమంలో 22వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు షేక్ నాగూర్, జనసేన డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, ఆదాం, కోలా మల్లి, జిలాని తదితరులు పాల్గొన్నారు.