మత్స్యకార భరోసా నిధులు విడుదల చేసిన జగన్

సముద్రంలో చేపలవేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది కూడా అమలుచేసింది. మంగళవారం నాడు సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. కరోనా వేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని, అయినా పేద ప్రజలు ఇబ్బందులు పడకూదన్న ఉద్దేశంతో తాము వారి సంక్షేమం కోసం అన్ని కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 1,19,875 మత్స్యకార కుటుంబాలకు దాదాపు రూ.120 కోట్లు జమ చేశామని తెలిపారు. మత్య్సకారులకు అండగా ఉంటామని ఇచ్చిన హామీని తాము నిలబెట్టుకుంటున్నామని జగన్ చెప్పారు. కరోనా పరిస్థితుల్లోనూ తాము ఏ మాత్రం వెనకడుగు వేయకుండా మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామని పేర్కొన్నారు.