నీటి క‌ష్టాల‌కు కార‌ణం జ‌గ‌నే!!

  • తాగునీటి ప‌థ‌కాల‌కు నిధులు విడ‌ద‌ల చేయ‌క‌పోవ‌డంతోనే క‌ష్టాలు
  • ప‌ట్ట‌ణాల‌తో పాటు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్ద‌డి
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌: ప్ర‌జ‌ల‌కు తాగునీరు అందించ‌టంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌లమైంద‌ని, వేస‌విలో ఆ ప్ర‌భావం మ‌రింత తీవ్రంగా ఉంద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి విమ‌ర్శించారు. మంగ‌ళ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యాలు తీసుకోక‌పోవ‌టం, తాగునీటి ప‌థ‌కాల‌కు నిధులు కేటాయించ‌క‌పోవ‌డం వ‌ల్ల వేస‌వి ప్రారంభంలోనే ప్ర‌జ‌ల‌కు తాగునీటి క‌ష్టాలు ఏర్ప‌డ్డాయ‌ని ఆరోపించారు. ముందస్తు ప్రణాళిక, తగినన్ని నిధులు లేకపోవడంతో చెరువులు నింపుకోలేకపోయారని. వైసీపీ ప్రభుత్వం తాగు నీటి చెరువులను నింపడంలో చేసిన నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందన్నారు. తాగు నీరు ఇవ్వండి మహాప్రభో అని ప్రజలు రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం కల్పించింద‌ని వెల్ల‌డించారు. ప‌ట్ట‌ణాల‌తో పాటు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్ద‌డి ప‌ట్ట‌ణాల‌తో పాటు, ప‌ల్లెల్లో కూడా నీటి ఎద్ద‌డి తీవ్రంగా ఉంద‌ని బాలాజి స్ప‌ష్టం చేశారు. నాదెండ్ల మండ‌లంలోని నాదెండ్ల‌, గ‌ణ‌ప‌వ‌రం, అప్పాపురం, ఎండుగంపాలెం, క‌న‌ప‌ర్రు,బుక్కాపురం, ఇర్ల‌పాడు, తుబాడు చెరువులు ఎండి పోవ‌డంతో తుర్ల‌పాడు మేజ‌ర్ నుంచి చెరువుల‌కు నీరు అందించాల‌ని ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు దిగిన విష‌యాన్ని ప్ర‌స్తావించారు. పెరుగుతున్న అవసరాలకు సరిపడా నీరందడం లేద‌న్నారు. వేసవిలో గుక్కెడు నీటి కోసం ప‌ట్ట‌ణ‌ ప్రజలు అల్లాడుతున్నారని, నాభాకనుగుణంగా ఒక్కో వ్యక్తికి సగటున వంద లీటర్లపైన నీరందించాల్సి ఉండగా, ఏ పట్టణంలో కూడా 70 లీటర్ల నీటిని అందించలేకపోతున్నారని మండి ప‌డ్డారు . రక్షిత నీటి పథకాల విస్తరణ గురించి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. పట్టణాల్లో అదనంగా రిజర్వాయర్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, పైప్‌లైన్ల నిర్మాణానికి నిధులు కేటాయించకుండా మొండిచేయి చూపారని ఆరోపించారు. పన్నుల వసూళ్లపై చూపిన శ్రద్ధ నీటి సరఫరా మెరుగుదలకు ఏ మాత్రం చూపలేదని, అందుకే ఇటువంటి ప‌రిస్థితి వాటిల్లింద‌ని విమ‌ర్శించారు. నిధులు రాకే ఇబ్బందులు.. జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాగునీటి ప‌థ‌కాల‌కు నిధులు విడ‌ద‌ల చేయ‌క‌పోవ‌టంతోనే ఇటువంటి ప‌రిస్థితి వాటిల్లింద‌ని బాలాజి ఆరోపించారు. చిల‌క‌లూరిపేట లాంటి ప‌ట్ట‌ణంలో ప్ర‌తి రోజు తాగునీరు ఇచ్చే అవ‌కాశం ఉన్నా.. నిధులు లేక ప్ర‌తి వేస‌విలో ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అమృత్ ప‌థ‌కం ద్వారా గుంటూరు కెనాల్ నుంచి పైపులైన్ ద్వారా చెరువుల‌కు నీరు నింపుకోవ‌టానికి అవ‌కాశం ఉంద‌ని, కాని ప్ర‌భుత్వం ఇందుకు అవ‌స‌ర‌మైన రూ. 80 కోట్లు విడ‌ద‌ల చేయ‌క‌పోవ‌డంతో ప‌ట్ట‌ణ ప్ర‌జ‌ల‌కు శాపంగా మారింద‌న్నారు. రాష్ట్రంలోనూ, జిల్లాలోని ప‌లు ప్రాంతాల్లోనూ తాగునీటి ప‌థ‌కాల‌కు నిధులు విడ‌ద‌ల చేయ‌క‌పోవ‌టం వ‌ల్ల‌నే వేస‌వి ఆరంభంలోనే నీటి క‌ష్టాలు మొద‌ల‌య్యాయ‌ని ఆరోపించారు. అధికారులు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకొని నీటి ఎద్ద‌డి లేకుండా చూడాల‌ని కోరారు.