అరాచకంతో అందలం నిలబెట్టుకోవాలనేది జగన్ కుతంత్రం

• ప్రజలను భయపెట్టి అయినా ఓటు వేయించుకోవాలని చూస్తున్నారు
• పోలీసులు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి
• కష్ట సమయంలో శ్రీ చంద్రబాబునాయుడికి సంఘీభావం తెలపడం మానవత్వం
• పార్టీ కార్యాలయానికి శ్రీ పవన్ కళ్యాణ్ రాకుండా చేయాలని ప్లాన్ చేశారు
• బంద్ లో పాల్గొన్న జనసేన నాయకులు, కార్యకర్తలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు
• చట్టం వైసీపీ వాళ్ళకు వర్తించదా?
• వైసీపీ ప్రభుత్వ విధానాలపై సమష్టిగా పోరాడుదాం
• మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

‘వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసే రాష్ట్రంలో వైసీపీ అరాచకానికి తెర తీస్తోంది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను భయపెట్టి, బెదిరించి అలజడులు సృష్టించాలని భావిస్తోంది. ఎలా అయినా ప్రజల్లో భయాందోళనలు కలిగించి వైసీపీ చెప్పినట్లు వినాలనే కొత్త రూల్ ను తీసుకొస్తోంది. ఇదే సూత్రంతో ప్రజలను వచ్చే ఎన్నికల్లో భయపెట్టి అయినా ఓట్లు వేయించుకోవాలనేది వైసీపీ నాయకుల ప్రణాళిక. అరాచకం చేసి మరోసారి అందలం ఎక్కాలనేది జగన్ కుతంత్రం. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీసీ ఎలాంటి విధ్వంసం సృష్టించిందో, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా అదే పద్ధతి అవలంబించాలని చూస్తోంద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. సోమవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘‘జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ, తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన బంద్ లో జనసేన నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పాల్గొన్నారు. అయితే కొన్ని చోట్ల జనసేన నాయకులపై పోలీసులు వ్యహరించిన తీరు అత్యంత దారుణంగా ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉందని కొన్ని ప్రాంతాల్లో కనీసం జనసేన జెండా కూడా పట్టుకోనివ్వలేదు. గుంటూరు నగరంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షులు శ్రీ నేరెళ్ల సురేష్ లను అన్యాయంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అదే నగరంలో మేయర్, ఎమ్మెల్యే ప్రవర్తించిన తీరు, స్వచ్ఛందంగా దుకాణాలు మూస్తే బలవంతంగా తెరిపించేందుకు ఒత్తిడి చేయడం చూశాం. చట్టం వైసీపీకి వర్తించదా? శాంతియుత నిరసనను, ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటే దానిని చెడగొట్టాలని వైసీపీ నాయకులు అలజడులు సృష్టించాలని చూశారు. అలాగే చాలా ప్రాంతాల్లో జనసేన నాయకులు శాంతియుతంగా సంఘీభావం ప్రకటిస్తుంటే వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య. గుడివాడలో జనసైనికుడిపై సబ్ ఇన్స్పెక్టర్ దాడి చేయడం కూడా మా దృష్టికి వచ్చింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. దాన్ని పోలీసులు కాలరాయడం సరైన పద్ధతి కాదు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ సమయంలో కూడా ప్రజలకు అవాంతరం కలిగించే పనులను ప్రోత్సహించరు. ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా జనసేన పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కనీసం నిరసన తెలిపేందుకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా, హౌస్ అరెస్టులు చేసిన ఈ ప్రభుత్వ తీరు గర్హనీయం. వైసీపీ ప్రభుత్వం వైసీపీ చేస్తున్న అరాచకాన్ని నిలువరించాలంటే పోరాటం తప్పదు. ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన సమయం ఇది.
• అక్రమ కేసులకు భయపడేది లేదు
రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే ప్రజలంతా సమష్టిగా తిరుగుబాటు చేయాలి. అక్రమ కేసులకు భయపడేది లేదు. నేను ఏది తల్చుకుంటే అది అయిపోవాలి అనే స్వభావం ఉండే జగన్ కచ్చితంగా పదవి నుంచి త్వరలోనే దిగిపోతాడు. ప్రజలంతా ఇప్పటికే జగన్ ను గద్దె దింపాలనే నిర్ణయానికి వచ్చారు. అది అర్ధమై వైసీపీ నాయకులు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖపట్నంలో జనవాణి నిర్వహించడానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్లినపుడు 3 రోజుల పాటు పోలీసులు హోటల్ నుంచి బయటకు రాకుండా ఆయనతో పాటు నాయకులను నిర్భందించారు. ఆ సమయంలో సంఘీభావం తెలియజేసిన శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి కష్ట సమయంలో సంఘీభావం తెలపడం అనేది సంస్కారం. రాజకీయాలతో దీనిని ముడి పెట్టకుండా మనకు నిలబడిన వారికి ఆపదలో మనం నిలబడాలనే సంస్కారం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో కాకుండా, మానవత్వ కోణంలోనూ చూడాలి.
• పోలీసులు కూడా ఆలోచించాలి
వ్యవస్థలను సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వంలో పోలీసులు సైతం చట్టాన్ని ప్రయోగించే సమయంలో ఆలోచించాలి. పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసులు పని చేస్తారు. అయితే చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా పోలీసులు వ్యవహరించాలి. సమీప భవిష్యత్తులో జనసేన ప్రభుత్వంలో కలిసి పని చేయాల్సిన పోలీసులు చట్ట అతిక్రమణలకు పాల్పడటం సరికాదు. వ్యవస్థలను సక్రమంగా పని చేయించాల్సిన వారే ఇలా ప్రవర్తించడం మంచిది కాదు. అహంకారంతో పాలన చేస్తూ ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టాలని చూస్తున్న వైసీపీ పెద్దల మాటలు విని ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించొద్దు.
• ప్రజలను నరకయాతనకు గురిచేశారు
పార్టీ పీఏసీ సమావేశం నిమిత్తం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చే సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు నిరంకుశం. విమానానికి అనుమతి నిరాకరించడం, తర్వాత రోడ్డు మార్గం ద్వారా వస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టడం వైసీపీ నిరంకుశ ధోరణికి ప్రతీక. పార్టీ కార్యాలయానికి వస్తుంటే.. అడుగు ముందుకు వేస్తే అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరించడం దారుణం. పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే పోలీసులు ఇలా ప్రవర్తించి ఉండొచ్చు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని జాతీయ రహదారి మీద నిలువరించే సమయంలో కిలోమీటర్ల మేర 6 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎంతోమంది సామాన్యులు ఇబ్బంది పడ్డారు. వైసీపీ ప్రభుత్వం మొదటి నుంచి సామాన్యులను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తోంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి వంటి ప్రజాదరణ ఉన్న నాయకుడినే వైసీపీ ఇబ్బంది పెట్టాలని చూస్తే, సామాన్యుడి పరిస్థితి ఈ పాలనలో ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
• జీ-20 సమ్మిట్ తో దేశానికి కొత్త కళ
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ-20 సమ్మిట్ తో కచ్చితంగా దేశానికి కొత్త కళ వచ్చింది. ప్రపంచంలో అత్యున్నత దేశాల నాయకులతో నిర్వహించిన ఈ సభ వల్ల దేశానికి పెట్టుబడులు విరివిగా రానున్నాయి. దేశ ప్రతిష్ట సైతం ప్రపంచ దేశాల దగ్గర పెరిగింది. కచ్చితంగా దేశ ప్రతిష్టను పెంచే గొప్ప సదస్సును నిర్వహించడం అభినందనీయం. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధిపరంగా ముందుకు వెళ్లడం సంతోషంగా ఉంది. వారాహి విజయ యాత్ర నాలుగో దశ త్వరలో కృష్ణా జిల్లాలో జరుగుతుంది. త్వరలోనే తేదీలను వెల్లడిస్తాం. వైసీపీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం విమర్శిస్తున్నారు. అది వైసీపీ వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇస్తే, ఆయన దానికి రెట్టింపు గౌరవం ఇస్తారనేది వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలి. ప్రజల బంగారు భవిష్యత్తు కోసం జనసేన పోరాటం ఆగదు. వైసీపీ విముక్త ఆంద్రప్రదేశ్ ను కచ్చితంగా సాధించి తీరుతాం” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్, ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు.