జనసేన పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయాల్లో మార్పునకు నాంది

* సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ పవన్ కళ్యాణ్ తరఫున కృతజ్ఞతలు
* ఇదే స్ఫూర్తిని, ఉత్తేజాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తు కార్యక్రమాలు
* మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో జనసేన నాయకుల ఆత్మీయ సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

బెజవాడ కృష్ణమ్మ జన సునామీతో ఉప్పొంగిందా..? బందరు సముద్ర తీరం ముందుకు వచ్చిందా అన్నట్లు విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఇంత జనమా? అనే ఆశ్చర్యం కలిగే రీతిలో జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున, పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. జనసేన పార్టీ పదో ఆవిర్భావ సభ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా బుధవారం మంగళగిరి లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ మనోహర్ గారు పార్టీ నాయకులు, మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వారాహి వాహనం పైకి ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కి ప్రజలకు అభివాదం చేసిన దగ్గర నుంచి సభ దగ్గరికి వెళ్లే వరకు లక్షలాదిమంది జనసైనికులు, ప్రజలు ఆయనకు పలికిన స్వాగతం అపూర్వమైనది. బెజవాడ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగనంతగా రోడ్డు షో విజయవంతం అయ్యింది. అభివాదం చేస్తూ, ప్రతి ఒక్కరిని పలకరిస్తూ, వారి ఆశీస్సులు తీసుకుంటూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వారాహి విజయ యాత్ర విజయవాడలో విజయవంతం కావడం ఒక గొప్ప సంకేతంగా నమ్ముతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాట కోసం ఎదురు చూశారు. సభా వేదిక వద్దకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రావడం సుమారు 5 గంటలకు పైగా ఆలస్యమైనా ఎవరూ కనీసం చెక్కుచెదరకుండా ఓపికగా సభాస్థలి వద్ద వేచి చూడడం ఓ గొప్ప మార్పునకు నాందిగా భావిస్తున్నాం. ముఖ్యంగా అంతమంది మహిళలు ఒక రాజకీయ పార్టీ సభకు రావడమే గొప్ప విషయం అయితే, సభ చివరి వరకు ఉండి పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని వినడం మరో గొప్ప విషయం.
* సమన్వయం, ప్రణాళిక అద్భుతం
కార్యక్రమం విజయవంతానికి పూర్తి సమన్వయంతో, ఐక్యమత్యంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆవిర్భావ సభకు అత్యంత అద్భుతంగా ఏర్పాట్లు చేసిన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీకి ప్రత్యేక అభినందనలు. మంచి ప్రణాళికతో ఏర్పాట్లు చేయడం బాగుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఎక్కడా ఇబ్బంది పడకుండా పార్కింగ్ దగ్గర నుంచి భోజనాల ఏర్పాట్లు వరకు చక్కగా చేయడం అందరితో శభాష్ అనిపించుకుంది. చాలామంది తమ విధులు మానుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సభకు వచ్చిన వారికి ఏర్పాట్లు చేయడం ఆనందం కలిగించింది. వరుసగా రెండు రోజులపాటు పార్టీ వాలంటీర్లు పడిన కష్టం గొప్పది. పార్టీ సభ నిర్వహణలో పూర్తిస్థాయిలో సహకరించిన విజయవాడ పోలీస్ కమిషనర్, కృష్ణా జిల్లా ఎస్పీలతో పాటు పోలీసు సిబ్బంది అందరికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కృష్ణా జిల్లా అధ్యక్షుడు శ్రీ బండ్రెడ్డి రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులకి, మచిలీపట్నం ఇంఛార్జి శ్రీ బండి రామకృష్ణ, విజయవాడ సిటీ అధ్యక్షుడు శ్రీ పోతిన మహేష్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు, నాయకులు, శ్రేణులకి అభినందనలు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నేతలు ఈ సభ కోసం ఏర్పాటు చేసిన కమిటీల్లో బాధ్యతలు తీసుకున్నారు.. ఈ ప్రాంత అసెంబ్లీ నియోజక వర్గాలకి సమన్వయకర్తలుగా పని చేశారు. వారికి కృతజ్ఞతలు. అర్ధరాత్రి వేళ కూడా మాకు అన్ని విధాలా సహకరించిన ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా మిత్రులకు, యాజమాన్యాలకు ధన్యవాదాలు. వారు చేసిన ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లక్షలాది మంది ఇళ్లలో ఆవిర్భావ సభను కనులారా వీక్షించగలిగారు. జన సైనికులు రాత్రి రెండు గంటల సమయంలోనూ పార్టీ జెండాలు పట్టుకొని జాగ్రత్తగా ఇళ్లకు వెళ్లడం చూస్తే ముచ్చట వేసింది. పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ తోపాటు ఆయన బృందం అహర్నిశలు కష్టపడ్డారు. అలాగే సభకు భూములు ఇచ్చిన రైతులకు అలాగే పార్కింగ్ కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోసం రాష్ట్ర ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదే నూతన ఉత్తేజం స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించి రాష్ట్రంలో కొత్త మార్పును చూపెడతామని గర్వంగా చెబుదాం” అన్నారు.