జనసేన అధినేత డిమాండ్‌

ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ రాష్ట్రంలో మూడు రాజధానులకు ఆమోదం తెలిపిన నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్‌లో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించగా  తొలుత విశాఖ హిందూస్థాన్‌  షిప్‌ యార్డులో జరిగిన ఘోరప్రమాద మృతులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించి, అనంతరం రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ.. అమరావతిలో రాజధాని కోసం భూసమీకరణ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇప్పుడు రాజధాని పరిరక్షణ వరకూ ప్రతి దశలోనూ రైతులకు అనుకూలంగా గొంతు వినిపించింది జనసేన మాత్రమేనని చెప్పారు.

రాజధాని నిర్మాణం కోసం అన్నంపెట్టే బూములు ఇచ్చి నడిరోడ్డుపైకి వచ్చేసిన రైతుల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన తెదేపా, వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్‌ చేశారు. ‘అమరావతిపై చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలన్నారు. రాజధాని వికేంద్రీకరణ పేరిట మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దని మొదట్నుంచీ చెబుతున్నా. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే మూడు రాజధానులు అంటూ మొదలుపెట్టారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయకోవిదులు, నిపుణులతో చర్చిస్తాం’ అని పవన్‌ అన్నారు.