యల్లటూరుకు ఘనస్వాగతం పలికిన రాజంపేట జనసేన శ్రేణులు

రాజంపేట, రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక అవినీతి పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని రాజంపేట నియోజకవర్గం జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు అన్నారు. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరి గురువారం రాజంపేట నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలతోపాటు జనసైనికులు ఘనంగా ఆహ్వానం పలికారు. సిద్ధవటం ఒంటిమిట్ట నందలూరు రాజంపేట నాలుగు మండలాల్లోని ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పెట్టారు ఆయన రాక సందర్భంగా ప్రధాన కూడళ్లలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి మంగళ వాయిద్యాలతో, కర్పూర హారతులతో కనీవిని ఎరుగని రీతిలో ఆహ్వానం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిణామాలు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో మార్పు తద్యమని వారు ఆశాభావం చేశారు. ప్రస్తుత వైకాపా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొందర్లోనే తొలగిపోతాయన్నారు. ఉన్నత ఉద్యోగిగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి కేవలం మీకు సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ భావాలు నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఆయన ఆశయాలకు, భావజాలానికి అనుగుణంగా భవిష్యత్తులో నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేస్తానని వారి సందర్భంగా హామీ ఇచ్చారు. గత పాలకులు మాటలు హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయే తప్ప ఎక్కడ కనుచూపుమేరలో అభివృద్ధి కనిపించడం లేదన్నారు. నియోజకవర్గానికి రావలసిన జిల్లాకేంద్రాన్ని, మెడికల్ కాలేజీని సైతం పోగొట్టిన దౌర్భాగ్యులు మన పాలకులని ఎద్దేవా చేశారు. అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయి ఎంతోమంది ప్రాణాలు, ఆస్తులు, పాడి సంపద కోల్పోయినప్పటికీ ఇప్పటివరకు కనీసం పునరావాసాలు కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో ప్రస్తుత పాలకులు ఉన్నారన్నారు. భవిష్యత్తులో అవకాశం కల్పిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని మీ అందరి దీవెనలు నామీద మెండుగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థయి నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.