టిడిపి నిరసన దీక్షకు జనసేన మద్దతు

రాజమండ్రి సిటీ: జగన్ ప్రభుత్వం ప్రశ్నించే ప్రతిపక్షాలు లేకుండా పాలన చేయాలని కుట్రలు చేయడం సిగ్గుచేడని అనుశ్రీ సత్యనారాయణ ప్రభుత్వంపై మండిపడ్డారు. శుక్రవారం ఉదయం స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్ వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన దీక్షా శిబిరానికి జనసేన పార్టీ రాజమండ్రి నగర ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమండ్రి పార్టీ అధ్యక్షులు వై. శ్రీనివాస్ మరియు తదితర ముఖ్య నాయకులు వెళ్లి రిలే నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రాథమిక ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కక్ష పూర్తి రాజకీయాలు చేయడం సమంజసం కాదని ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో నిలబడి తేల్చుకోవాలి అన్నారు. జనసేన, టిడిపి కలిసి పోటీ చేస్తాయంటే వైసిపి నేతలు వణికి పోతున్నారని, వారి డిపాజిట్లు గల్లంతవుతాయని ఆందోళన చెందుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలంతా హర్షించారని, రాష్ట్రంలో అవినీతి అరాచక పాలన అంతం చేయడమే జనసేన పార్టీ లక్షమన్నారు. సొంత బాబాయిని హత్య చేసిన వారిని అరెస్టు చేయించి కుటుంబానికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రంలో అక్రమ అరెస్టులను మాత్రం ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు నగర కార్యవర్గ సభ్యులు జనసేన యువ నాయకులు నగర జనసేన నాయకులు జ సైనికులు తదితరులు పాల్గొన్నారు.