మత్స్యకారులకి పక్కా ఇల్లు కట్టేలా జనసేన పోరాటం చేస్తుంది: లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం, భోగాపురం మండలం, ముక్కాం గ్రామంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ముక్కాంలో అధికంగా మత్స్యకార కుటుంబాలు నివసిస్తుంటారు. వీరిలో ఎక్కువ మందికి పూరి గుడిసెలు ఉండటం గమనార్హం, బుధవారం ఉదయం ఒక పూరి గుడిసె తగలబడుతుండటం చూసిన జనసైనికులు వెంటనే స్పందించి ఆ మంటలను ఆర్పడం జరిగింది. దీనిలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నెల్లిమర్ల నియోజకవర్గ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆ ప్రదేశానికి వెళ్ళి బాధితులని పరామర్శించారు. లోకం మాధవి మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం 2019 ఎలక్షన్ల నాడు మత్స్యకార కుటుంబాలకి పక్కా ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే తుంగలోకి తొక్కేసారని మండిపడ్డారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో ఎన్నో అగ్నిప్రమాదాలు సంభవించాయని, వాటిని నిర్మూలించేలా నియోజకవర్గ నాయకులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఎటువంటి చర్యలు చేపట్టలేదని, కనీసం అగ్నిమాపక సిబ్బంది వారు కూడా స్పందించటం లేదని తెలిపారు. మత్స్యకారులు ఎంతో కష్టపడి దాచిపెట్టుకున్న సొమ్ముని వారి గుడిసెల్లో పొందుపరచుకుంటే ఇలాంటి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు కష్టార్జితం మొత్తం అగ్గిపాలవటం చాలా బాధాకరమైన విషయం అని తెలియజేశారు. ఈ సమస్య పైన తమ వైపు నుండి భవిష్యత్తు కార్యచరణ ఉంటుందని, ఈ అగ్నిప్రమాదాలు నిలువరించేలా, మత్స్యకారులకి పక్కా ఇల్లు కట్టేలా తమ పోరాటం ఉంటుందని లోకం మాధవి తెలిపారు.