విద్యార్థులకు వెన్నుదన్నుగా జనసేన ఉంటుంది – అర్బన్ జిల్లా నాయకులు ఆళ్ళ హరి.

విద్యార్ధులపై లాఠీచార్జి చేయటం అమానుషం

ఇదేనా విద్యార్థులకు మేనమామగా జగన్ ఇచ్చే కానుక?

మా బడి మాకివ్వండి అంటూ విద్యార్థులు రోడ్డెక్కారు అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన పరిపాలన ఉంటుందా?

ఎయిడెడ్ కళాశాలల విలీనాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ జనసేన ఒప్పుకోదు.

పోరాడుతున్న విద్యార్థులకు వెన్నుదన్నుగా జనసేన ఉంటుంది.

జనసేన అర్బన్ జిల్లా నాయకులు ఆళ్ళ హరి.

ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని , తమ భవిష్యత్ ను నాశనం చేయొద్దు అంటూ శాంతియుతంగా నిరసన చేస్తున్న అనంతపురం యస్ యస్ బీ యన్ కాలేజీ విద్యార్థినీ , విద్యార్థులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయటం అమానుషమని అర్బన్ జిల్లా జనసేనపార్టీ నాయకులు ఆళ్ళ హరి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఎయిడెడ్ కళాశాలలను విలీనం చేయాలంటూ ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో వేలాదిమంది పేద విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమని చదువుకు దూరం చేయొద్దు అంటూ శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయటాన్ని ఆళ్ళ హరి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఆడపడుచులకు అన్నగా, పిల్లలకు మేనమామగా ఉంటానంటూ ప్రమాణం చేసిన ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే చిన్నారుల పాలిట కంసుడు కన్నా దుర్మార్గంగా మారాడని విమర్శించారు. విద్యార్థులను అదికూడా ఆడపిల్లలను కూడా చూడకుండా మగ పోలీసులతో తలలు పగలగొట్టించిన ప్రభుత్వ దమనకాండను తీవ్రంగా ఆక్షేపిస్తున్నామన్నారు. చొక్కాలు పట్టుకొని లాక్కెల్లంత తప్పు విద్యార్థులు ఏమి చేశారని ప్రశ్నించారు. తమకి అమ్మఒడి వద్దు, బూట్లు, బ్యాగ్స్ వద్దు మా బడి మాకివ్వండి మమ్మల్ని చదువుకొనివ్వండి అంటూ బడిపిల్లలు అభ్యర్దిస్తుంటే ప్రభుత్వంలో కనీస స్పందన లేకపోవటం దారుణమని, పాషాన్న హృదయంతో ముఖ్యమంత్రి, సహచర మంత్రులు, సంబంధిత అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారని ధ్వజమెత్తారు. అకారణంగా అత్యుత్సాహంతో విద్యార్థులపై అమానుషంగా లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు. విద్యార్థుల పాలిట శాపంగా మారిన ఎయిడెడ్ పాఠశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేవరకు విద్యార్థులకు అండగా జనసేన ఉంటుందని ఆళ్ళ హరి అన్నారు.