ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుంది.. పార్టీ నేతలతో జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మరోసారి రాజకీయంగా ఫుల్ యాక్టివ్ అయ్యారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి కార్యాలయంలో పార్టీ నేతలతో భేటీ అయ్యారు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత తొలిసారి ఆయన పార్టీ ఆఫీస్‌కు వచ్చారు. ఇటీవల కరోనాతో మరణించిన వారికి నివాళులర్పించారు. ఇటీవల నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేష్ కుటుంబసభ్యులకు ఐదు లక్షల రూపాయల చెక్‌ను అందచేశారు. అనంతరం పార్టీ కార్యక్రమాలపై నేతలతో చర్చించారు పవన్‌ కల్యాణ్‌.

గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌కే పరిమితమైన పవన్ కల్యాణ్.. ఇక క్రియాశీలక రాజకీయాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. నిరసన కార్యక్రమాలతో పాటు సమకాలీన రాజకీయ అంశాలపై పొలిటికల్ అఫైర్స్ కమిటీలో చర్చించారు. భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై దండయాత్ర చేయడానికి సమాయాత్తమవుదామని పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు పిలుపునిచ్చినట్లు సమాచారం.

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది జన సైనికులను కోల్పోయామన్న పవన్.. వ్యక్తిగతంగా ఎంతో బాధించిందన్నారు. ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించామన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కృషి చేస్తుందన్న పవన్.. ప్రస్తుత పరిస్థితి లో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్య అన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన జనంతోనే ఉంటుందని స్పష్టం చేశారు.