JEE-NEET పరీక్షలు ముందుగా ప్రకటించిన తేదీల్లోనే.. గైడ్‌లైన్స్ విడుదల

కరోనావైరస్ విజృంభిస్తున్ననేపథ్యంలో జేఈఈ 2020, నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ 2020 పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దేశవ్యాప్త వ్యతిరేకత మధ్యనే తాజాగా.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ, నీట్‌ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. ముందుగా ప్రకటించినట్లుగానే జేఈఈ (మెయిన్స్) సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్‌ సెప్టెంబరు 13న నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ మార్గదర్శకాలను విడుదల చేసింది.

జూలైలోనే జరగాల్సిన జేఈఈ, నీట్ పరీక్షలు కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కేంద్రం సెప్టెంబరులో నిర్వహిస్తామని వెల్లడించింది. ఈక్రమంలో పరీక్షలను వాయిదా వేయాలన్న 11 రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల పిటిషన్‌ను సుప్రీంకోర్టు కోట్టివేసింది. పరీక్షలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతుందని, అనుకున్నవిధంగానే పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. దీంతో సుప్రీం ఆదేశాలను శిరసావహిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఎన్టీఏ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ఈ క్రమంలో మరోసారి పరీక్షలు వాయిదా వేయాలన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. పలు పార్టీల నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరీక్షలను వాయిదా వేయాలని ఇప్పటికే కేంద్రప్రభుత్వాన్నిడిమాండ్ చేశాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, పలువురు కీలక నేతలు పరీక్షలు రద్దు చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరుతూ ఉన్నారు.