పోలియో రహిత సమాజం కోసం చేయి చేయి కలపండి!

  • విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు కందుల

వైజాగ్ సౌత్: పిల్లల్లో అంగ వైకల్యానికి ప్రధాన కారణమైన పోలియో మహమ్మారిని దేశం నుంచి తరిమి కొట్టి తద్వారా పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలపాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు పిలుపు నిచ్చారు. మార్చి 3 ఆదివారం జరిగిన పోలియో చుక్కలు వేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు దేశంలో పిల్లలను పోలియో మహమ్మారి కబళించి వేసిందని, కానీ దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా పోలియో చుక్కలు వేసే కార్యక్రమాలు ప్రారంభమైన తరువాత మన దేశంలో పోలియోకు స్థానం లేకుండా పోయిందని హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ మహమ్మారి ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయినప్పటికి దీని పట్ల ఏమాత్రం అలసత్వం వహించకుండా ప్రభుత్వం పోలియో చుక్కలు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు తమ విధిగా పోలియో చుక్కలు వేసే సిబ్బందికి సహకరించి 5సంవత్సరాలు వయస్సు లోపు వున్న తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక శానిటరీ ఇన్స్పెక్టర్ కాశీరావు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీ శశి, బాల, ఆశావర్కర్ నాగలక్ష్మి, బృంద సభ్యులు తులసి, ప్రసన్న, లక్ష్మి తదితరులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.