కళ్యాణ మంటపమే క్రియాశీలక సభ్యత్వ వేదిక

  • మూడు ముళ్ళ సాక్షిగా జనసేన క్రియాశీలక సభ్యులైన వధూవరులు
  • ఇరు వర్గాల బంధుమిత్రులకూ సభ్యత్వం
  • పెడన నియోజకవర్గం, రావిగుంట గ్రామంలో కార్యక్రమం
  • 60 మందికి పైగా సభ్యత్వాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్

పెడన: రెండు వారాలుగా సాగుతున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు ఘటనలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పెడన నియోజకవర్గ పరిధిలో జరిగిన ఓ వివాహ వేడుక పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వేదికగా నిలచింది. అగ్నిసాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన వధూవరులు, మూడు ముళ్ళ సాక్షిగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం స్వీకరించారు. వధూవరులతో పాటు ఇరువర్గాల బంధుమిత్రులు అదే వేదిక నుంచి సుమారు 60 మందికి పైగా జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించారు. పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలం, రావిగుంట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమం జనసేన పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా నిలచింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్న దూసనపూడి భాను, తన వివాహ వేడుకకు పార్టీ నాయకులు, కార్యకర్తలందర్నీ ఆహ్వానించారు. తన వివాహ వేడుక స్వాగత ఫ్లెక్సీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు వేయించి అభిమానం చాటుకున్న భాను, తన వివాహ వేదిక సాక్షిగా ఏదైనా పార్టీకి ఉపయోగపడే కార్యక్రమం చేయాలని భావించారు. విషయాన్ని నియోజకవర్గ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ చెవిన వేయగా, ఆయన సలహా మేరకు వధూవరులిద్దరు కళ్యాణ వేదిక పైనే రూ. 500 చొప్పున చెల్లించి క్రియాశీలక సభ్యులయ్యారు. అంతేకాదు పెళ్లి వేడుకకు హాజరైన ఇరు వర్గాల బంధుమిత్రులకు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ప్రజల తరఫున చేస్తున్న పోరాటాలను వివరించి సుమారు 60 మందికి యడ్లపల్లి రామ్ సుధీర్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం అందచేశారు. ఈ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.