కొత్త ప్రాజెక్టుతో రంగంలోకి దిగుతున్న కమల్!

కమల్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన సినిమాల మధ్య పెద్దగా గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఉంటారు. అలాంటిది ‘కొంతకాలంగా ‘ఇండియన్ 2’ సినిమా ఆగిపోయింది. ఏ రోజుకు ఆ రోజు దర్శక నిర్మాతల మధ్య వివాదం ముదురుతూ వెళుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా షూటింగు మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా? అనే విషయంలో క్లారిటీ లేకుండా పోతోంది. ఈ సినిమాను పూర్తిచేసిన తరువాత, తన సొంత బ్యానర్లో ‘విక్రమ్’ చేయాలనే ఉద్దేశంతో కమల్ ఉన్నారు. కానీ ‘ఇండియన్ 2’ విషయం ఎటూ తేలడం లేదు.

ఒకవేళ ‘విక్రమ్’ సినిమాను మొదలుపెట్టిన తరువాత, ‘ఇండియన్ 2’ మూవీ షూటింగ్ మొదలైతే ‘విక్రమ్’ షూటింగు ఆపుకోవలసి వస్తుంది. పెద్ద ఆర్టిస్టుల డేట్స్ కావలసినప్పుడు దొరకవు. అందువలన కమల్ ‘విక్రమ్’ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టేసి, తమిళంలో ‘దృశ్యం 2’ రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారట. దర్శకుడు జీతూ జోసెఫ్ మలయాళ .. తెలుగు భాషల్లో ఈ సినిమాను 40 రోజుల్లో పూర్తిచేశారు. అందువలన ఆయనతో కలిసి ఈ సీక్వెల్ చేయడానికి కమల్ రెడీ అవుతున్నారని అంటున్నారు. తమిళంలో ‘దృశ్యం’ మొదటిభాగంలో కమల్ తో పాటు గౌతమి .. నివేదా థామస్ నటించారు.