తమిళనాడు అసెంబ్లీ పోరు.. 154 స్థానాల్లో కమల్‌ పార్టీ పోటీ

తమిళనాడులో ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ పార్టీల మధ్య పొత్తుల కుదురుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన డీఎంకే-కాంగ్రెస్‌, అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కిరాగా.. తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన సినీ నటుడు కమల్‌ హసన్‌ పలు పార్టీలో కలిసి పోటీకి సిద్ధమవుతున్నారు. 234 అసెంబ్లీ స్థానాలుండగా 154 స్థానాల్లో మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) బరిలో దిగనున్నట్లు కమల్‌ పేర్కొన్నారు. కూటమిలో భాగస్వాములైన ఆలిండియా సమతువ మక్కల్‌ కచ్చి, ఇందియా జననాయగ కచ్చికి 80 స్థానాలను కేటాయించినట్లు పేర్కొన్నారు. రెండు పార్టీలు చెరో 40 స్థానాల్లో పోటీ చేస్తాయని తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం నాలుగు శాతం ఓట్లు సాధించింది. పట్టణంలో ఓటింగ్‌ 10 శాతం అధికంగా ఉంది. ఎంఎన్‌ఎం ఉపాధ్యక్షుడు, కోయంబత్తూర్‌ అభ్యర్థి డాక్టర్ ఆర్ మహేంద్రన్ మొత్తం ఓట్లలో 11.6 శాతం సాధించారు. ఇదిలా ఉండగా.. పార్టీ అభ్యర్థులుగా దరఖాస్తు చేసుకునేందుకు ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రారంభించారు. వచ్చిన దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు.