భారతదేశ ప్రతిష్టను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన మన క్రికెటర్ కపిల్

క్రికెట్ కు కొత్త బాటలు వేసినదే కాక భారతదేశ ప్రతిష్టను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన మన క్రికెటర్ కపిల్ దేవ్. 1983 లో భారత్ ను విశ్వవిజేతగా నిలబెట్టి కపిల్ దేవ్ టీమ్ భారతజాతికి గర్వకారణంగా నిలిచింది. కపిల్ దేవ్ భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించారు. క్రికెట్ ప్రపంచoలో తనకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరచుకున్న కపిల్ క్రికెట్ లో అడుగు పెట్టిన తొలి రోజుల్లోనే తన ఫాస్ట్ బౌలింగ్ తో మంచి మంచి బాట్స్ మెన్ కు సైతo చమటలు పట్టించేవారు.

 కపిల్ పూర్తి పేరు కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్. 2002లో విజ్డెన్ పత్రికచే 20 వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా గుర్తింపు పొందినాడు. సారథ్యం వహించిన ఏకైక ప్రపంచకప్ (1983) లో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 నెలల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.

వ్యక్తిగత జీవితం:

1959, జనవరి 6 న జన్మించిన కపిల్ దేవ్ తల్లిదండ్రులు రాంలాల్ నిఖంజ్, రాజ్ కుమారీలు. వారి స్వస్థలం ప్రస్తుత పాకిస్తాన్ లోని రావల్పిండి సమీపంలోని ఒక గ్రామం. దేశ విభజన సమయంలో భారత్‌కు తరలివచ్చి చండీగర్‌లో స్థిరపడ్డారు. తండ్రి రాంలాల్ భవనాల, కలప వ్యాపారంలో రాణించాడు. డి.ఏ.వి.కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ దేవ్ 1971లో దేశ్ ప్రేమ్ ఆజాద్ శిష్యుడిగా చేరువైనాడు. అతని వలననే 1979 రోమీ భాటియా పరిచయం అయింది. 1980లో వారి వివాహానికి కూడా ఆజాదే చొరవ చూపినాడు. 1996లో కపిల్ దంపతులకు జన్మించిన కూతురు అమియాదేవ్.

ఆల్‌రౌండర్‌గా:

కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. 1980లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను హడలెత్తించాడు. బ్యాట్స్‌మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్‌లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో జింబాబ్వేపై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన  ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.

1983 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ లో:

1983 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ ఓటమి అంచునుంచి తప్పించుకోవడమే కాదు. చరిత్రను తిరగరాసి మరీ  విజయాన్ని సొంతం చేసుకుంది. కపిల్ దేవ్ టీమ్ జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి నేటితో 37 ఏళ్లు పూర్తయ్యాయి. కపిల్ దేవ్ సారథ్యంలో వెస్టిండీస్ తో తలపడిన భారత క్రికెట్ టీమ్ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. వెస్టిండీస్ జట్టు పరిస్థితి ఇప్పుడు దిగజారిందేమో కానీ అప్పట్లో వెస్టిండీస్ అంటే క్రికెట్‌లో బాహుబలి టీమ్ లాంటిది అనే పేరుండేది. అప్పట్లో వరుసగా ప్రపంచ కప్‌లు గెలుస్తోన్న జట్టు అది. అదే సమయంలో భారత్ కేవలం 73 పరుగులుకే 7 వికెట్లు కోల్పోయింది. అంటే టాప్ అండ్ మిడిల్ అర్డర్ పూర్తిగా విఫలం అయింది. మొత్తంగా వెస్టిండీస్‌కు కేవలం 183 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. దాంతో గ్రౌండ్‌లో ఉన్న వాళ్లంతా విండీస్ ఆడుతు పాడుతూ గెలుస్తుంది అనుకున్నారు.

కానీ క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంటారుగా. ఈ మ్యాచ్‌లో కూడా సరిగ్గా అదే జరిగింది. అద్భుతం జరిగింది. భారత బౌలర్లు విండీస్ టీమ్‌ను 140 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక్కడ తమాషా విషయం ఏంటంటే. 73 పరుగులకే 7 మంచి భారత బ్యాట్స్‌మెన్‌ వెనుతిరగ్గా, 90 పరుగుల వద్ద 9 మంది భారత బ్యాట్స్ మెన్ ఔట్ అయ్యారు. లార్ట్స్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఇలా తొలి ప్రపంచ కప్‌ను అందుకుని ప్రపంచానికి తన సత్తా చాటింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు నేటితో 37 సంవత్సరాలు పూర్తి అయ్యాయి.

దేశవాళీ పోటీలలో ప్రదర్శించిన ఆటతీరు:

1975 నవంబర్లో కపిల్ దేవ్ హర్యానా తరఫున పంజాబ్ పై తొలిసారిగా ఆడి 39 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్ 63 పరుగులకే ఇన్నింగ్స్ ముగియడం హర్యానా విజయం సాధించడం జరిగింది. తొలి మ్యాచ్‌లో రాణించిననూ మొత్తం సీజన్‌లో 3 మ్యాచ్‌లు కలిపి కేవలం 12 వికెట్లు మాత్రమే సాధించాడు.

1976-77 సీజన్‌లో జమ్ము కాశ్మీర్ పై ఓపెనింగ్ బౌలర్‌గా రాణించి 36 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు. కాని మళ్ళీ సీజన్‌లోనూ తదుపరి మ్యాచ్‌లలో రాణించలేడు. హర్యానా జట్టు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధిమ్చడంతో అందులో 9 ఓవర్లు బౌలింగ్ చేసి 20 పరుగులకే 7 వికెట్లు సాధించి బెంగాల్ జట్టును 19 ఓవర్లలోనే 58 పరుగులకు కట్టడి చేశాడు.

1977-78 సీజన్‌లో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో 38 పరుగులకే 8 వికెట్లు సాధించి మరో సారి తన ప్రతిభను చాటిచెప్పాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్సులోనే 3 వికెట్లు సాధించి ఒకే అంతర్జాతీయ మ్యాచ్‌లో 10 వికెట్ల ఘనతను తొలిసారిగా పొందినాడు. తరువాత ఇదే ఘనతను టెస్ట్ క్రికెట్‌లో కూడా రెండు సార్లు సాధించాడు.

1978-79 సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు. బ్యాటింగ్‌లో కూడా రెండూ అర్థశతకాలను సాధించాడు. ఇరానీ ట్రోఫిలో 8 వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులో ప్రవేశించి 62 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫిలో 24 ఓవర్లలో 65 పరుగులకు 7 వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. దేవధర్ ట్రోఫి, విల్స్ ట్రోఫీలలో నార్త్ జోన్ తరఫున తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. ఇదే సీజన్‌లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడి ఆరంగేట్రం చేశాడు.

టెస్ట్ మ్యాచ్ లలో:

1978, అక్టోబర్ 16న కపిల్ దేవ్ పాకిస్తాన్ పై ఫైసలాబాదులో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. తొలి టెస్టులో తన గణాంకాలు మ్యాచ్‌ను అంతగా ప్రభావితం చేయలేకపొయాయి. సాదిక్ మహమ్మద్ను ఔట్ చేసి తొలి టెస్ట్ వికెట్ సాధించింది ఈ మ్యాచ్‌లోనే. కరాచిలోని నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్థసెంచరీని చేసి భారత్ తరఫున అతివేగంగా అర్థసెంచరీ పూర్తిచేసిన రికార్డు సృష్టించాడు. ఆ తరువాత భారత్ పర్యటించిన వెస్టీండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లో 126 పరుగులు సాధించి తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదుచేశాడు.

సాధించిన రికార్డులు:

1994, జనవరి 30న శ్రీలంకపై బెంగుళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజీలాండ్కు చెందిన రిచర్డ్ హాడ్లీ రికార్డును అధికమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. (తరువాత ఇతని రికార్డు కూడా ఛేదించబడింది)

టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు, 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు.

1988లో జోయెల్ గార్నల్ రికార్డును అధికమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. తరువాత 1994లో పాకిస్తాన్ కు చెందిన వసీం అక్రం ఈ రికార్డును ఛేదించాడు.

వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు.

లార్డ్స్ మైదానంలో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఈ ఘనత పొందిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

సాధించిన అవార్డులు:

1979-80 :   అర్జున అవార్డు

1982 :     పద్మశ్రీ అవార్డు

1983 :     విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ దొ ఇయర్ అవార్డు

1991 :     పద్మవిభూషన్ అవార్డు

2002 :     విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ

2013 లో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ ఈ సంవత్సరానికిగానూ కల్నల్ సికె నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు. ఈ పురస్కారంలో భాగంగా ఆయనకు ట్రోఫీ, 25 లక్షల చెక్ అంజేస్తారు. ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్లలో ఒకడైన కపిన్ భారత్ తరపున 131 టెస్టులు ఆడి 434 వికెట్లు పడగొట్టాడు. ఇదే ఫార్మాట్లో 400 వికెట్లు, 500 పరుగులు చేసిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. 225 వన్డేలు ఆడిన కపిల్ 253 వికెట్లు తీసి 3783 పరుగుల సాధించాడు. ఇతని సారథ్యంలోనే భారతజట్టు 1983లో ప్రపంచ కప్ సాధించింది.