ప్రపంచ క్రికెట్ క్రీడారంగంలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకొన్న సచిన్ రమేష్.

క్రికెట్ అంటే అందరికి గుర్తొచ్చే పేరు సచిన్ టెండుల్కర్. క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్ అనే స్థాయికి తన ఆటను తీసుకువెళ్ళాడు సచిన్. ప్రపంచ క్రికెట్ క్రీడారంగంలో తన అట శైలితో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకొన్న భారతీయ ఆటగాడు సచిన్ రమేష్. ఈనాడు భారత్ లో క్రికెట్ కు ఇంతజనాదరణ ఉందంటే అదంతా సచిన్ ఆటతీరు ఒక ముఖ్యకారణం. 1990 సమయంలో భారత క్రికెట్ లో మెరుపులు మెరిపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఆటగాడు సచిన్. భారత జట్టుకు ఆపద్భాందవుడిగా ఎన్నో విజయాలు అందజేసి క్రికెట్ అబిమానుల మనసులను దోచుకున్న క్రికెటర్ టెండుల్కర్.

సచిన్ సాదించిన రికార్డుల గురించి చెప్పుకుంటూ పొతే వన్డేలు, టెస్టు మ్యాచులలో అత్యధిక సెంచరీలు, పరుగుల రికార్డ్, అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరిస్ అందుకున్న బ్యాట్స్ మెన్ రికార్డ్, క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే అగ్రస్థాన బ్యాట్స్‌మెన్ గా రికార్డ్, రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు పొందిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా రికార్డ్, అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో  గౌరవిoచబడడమే కాకుండా ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు ఇలా రికార్డుల మీద రికార్డులుసాదించారు సచిన్.

సచిన్ పూర్తి పేరు సచిన్ రమేష్ టెండూల్కర్. 1973లో ముంబైలోని సారస్వత బ్రహ్మాణ కుటుంబంలో రజనీ, రమేష్ దంపతులకు ఏప్రిల్ 24, న జన్మించారు. ఆయన తండ్రి మరాఠా నవల రచయిత. ఆయన తల్లి ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంటుగా పని చేస్తుండేవారు. 90వ దశకంలో భారత క్రికెట్ ను, అభిమానులను ఉర్రూతలు ఊగించిన ఈ ఆటగాడు 1995వ సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రానికి చెందిన పారిశ్రామికవేత్త ఆనంద్ మెహతా కూతురు అయిన అంజలిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా జన్మించారు. వారి పేర్లు సారా, అర్జున్.

సచిన్ టెండూల్కర్ గురువు అయిన రమాకాంత్ ఇచ్చిన సలహా మేరకు శారదా ఆశ్రమ విద్యామందిర్ లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. అక్కడ పేస్ బౌలింగులో ట్రైనింగ్ కోసం వెళితే అక్కడ అప్పటి ఫాస్ట్ బౌలర్ డెన్నిస్ లిల్లి అనే శిక్షకుడు సచిన్ కు బ్యాటింగ్ ఫై ఎక్కువ శ్రద్ధ పెట్టాలని సూచించాడట. దీంతో తను అప్పటి నుండి బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాడు.

క్రికెట్ లోకి అడుగులు:

లిటిల్ మాస్టర్ లేదా మాస్టర్ బ్లాస్టర్  అని ముద్దుగా పిలుచుకునే సచిన్ 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. 16వ ఏటలోనే అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన సచిన్ టెండూల్కర్, పాకిస్థాన్ తో తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్ లో కేవలం 15 పరుగులు చేసి అవుటైన సచిన్, ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ క్రికెట్లో ప్రపంచ రికార్డులన్నీ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు, పరుగులు సచిన్ వే.

ఇంతవరకు ఆయన రికార్డుల దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ రాలేకపోయారు. దులీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలలో ఆడిన తొలి మ్యాచుల్లోనే సెంచరీలు సాధించి కొత్త రికార్డులు నెలకొల్పాడు.

 1997-1998లో రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న పొంది ఈ అవార్డు పొందిన ఏకైక క్రికెట్ క్రీడాకారుడిగా నిల్చాడు. ఇప్పటి వరకు క్రికెట్ క్రీడా ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన క్రీడాకారులలో ఒకరిగా నిలచాడు.

1999 వరల్డ్ కప్ సమయంలో:

1999 ప్రపంచ కప్ టోర్నీ ఆడే సమయంలో సచిన్ టెండూల్కర్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆ సమయంలో అకస్మాత్తుగా తన తండ్రి మరణ వార్తను తీవ్ర నిరాశకు గురయ్యాడు. తండ్రి అంత్యక్రియల కోసం భారత్ కు రావడంతో జింబాబ్వేతో ఆడే ఛాన్స్ కోల్పోయాడు. అయితే వెంటనే ఆ కార్యక్రమాన్ని ముగించుకుని కెన్యాతో జరిగిన మ్యాచ్ లో పాల్గొన్నాడు. అంతేకాదు అందులో 101 బంతుల్లోనే 140 పరుగులు చేసి ఆ సెంచరీని తన తండ్రికి అంకితమిచ్చిన గొప్ప ఆటగాడు.

షేన్ వార్న్ కలలో:

సచిన్ టెండూల్కర్ గురించి ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే. ఆస్ట్రేలియాకు చెందిన అద్భుత స్పిన్నర్ షేన్ వార్న్ సచిన్ గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ తను రాత్రి వేళ నిద్రిస్తుంటే. సచిన్ తన బ్యాటింగుతో అతనిని భయపెట్టాడని చెప్పాడు.

డబుల్ సెంచరీ కొట్టిన తొలి ఆటగాడు:

వన్డేలు, టెస్టు మ్యాచులలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నాడు. అంతేకాదు ఇంటర్నేషనల్ వన్డే క్రికెట్ లో కూడా డబుల్ సెంచరీ కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్రపుటల్లోకెక్కాడు. అంతేకాదు అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సీరిస్ అందుకున్న బ్యాట్స్ మెన్ రికార్డులను నెలకొల్పాడు.

రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అండ్ బౌలర్ గా :

 సచిన్ టెండూల్కర్ రైట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ అండ్ బౌలర్ అని మనందరికీ తెలుసు. అయితే తన చేతి రాతకు మాత్రం లెఫ్ట్ హ్యాండ్ ను ఉపయోగిస్తారు. ఈ విషయం అతికొద్ది మందికే తెలుసు. అలాగే సచిన్ క్రికెట్ పుస్తకంలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసి భావితరాలకు ఓ మార్గదర్శి అయ్యాడు.

 16-నవంబర్-2013 నాడు తన 40వ ఏట 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రీడారంగం నుంచి విరమించుకున్న సందర్భంలో భారతప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఈయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.

2002లో విజ్డెన్ పత్రిక టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియాకు చెందిన డాన్ బ్రాడ్‌మెన్, వన్డే క్రికెట్ లో వెస్ట్‌ఇండీస్ కు చెందిన వివియన్ రిచర్డ్స్ ల తర్వాత క్రికెట్ క్రీడా ప్రపంచంలోనే సచిన్ ను రెండో అత్యున్నత బ్యాట్స్‌మెన్ గా ప్రకటించింది. 2003లో మళ్ళి తిరగరాసి వన్డే క్రికెట్ లో వివియన్ రిచర్డ్స్కు రెండో స్థానంలోకి నెట్టి సచిన్ ను మొదటిస్థానంలో నిలబెట్టారు. అతని యొక్క ఆటతీరు, ఆట లోని నైపుణ్యం ఎంత చూసిననూ తనివి తీరని అభిమానులున్నారు.  సచిన్ అవుటైన వెంటనే టి.వి.లను కట్టేసిన సందర్భాలు, స్టేడియం నుంచి ప్రేక్షకులు వెళ్ళి పోయిన  సందర్భాలు ఎన్నెన్నో. టెస్ట్ రికార్డులు చూసిననూ, వన్డే రికార్డులు చూసిననూ అడుగడుగునా అతని పేరే కనిపిస్తుంది. లెక్కకు మించిన రికార్డులు అతని సొంతం. టెస్ట్ క్రికెట్ లో అత్యధిక పరుగులలో అక్టోబర్ 17, 2008 న వెస్ట్‌ఇండీస్ కు చెందిన బ్రియాన్ లారానుదాటుకొని మొదటి స్థానం సంపాదించాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగుల సాదించిన  రికార్డు అతనిదే . ఇక సెంచరీల విషయంలో అతనికి దరిదాపుల్లో ఎవరూ లేకపోవడం గమనార్హం. 2010 ఫిబ్రవరి 24 న దక్షిణాఫ్రికాతో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ మ్యాచ్ లో సచిన్ 200 పరుగులు సాధించిన మొట్ట మొదటి ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే క్రికెటర్ అందుకోని మైలురాయిని అధిరోహించాడు. 2012, మార్చి 16న అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లలో (వన్డేలు, టెస్టులు కలిపి) ఎవరూ సాధించని 100వ సెంచరీతో కొత్తరికార్డు సృష్టించాడు.

సచిన్ సాధించిన రికార్డులు

వన్డే రికార్డులు:

వన్డే క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (49 సెంచరీలు)

వన్డే క్రికెట్ లో అత్యధిక అర్థ సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (96 అర్థ సెంచరీలు)

అత్యధిక వన్డే పోటీలకు ఆడిన క్రికెటర్. (463 వన్డేలు)

వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అవార్డు పొందిన క్రికెటర్. (62 సార్లు)

వన్డే క్రికెట్ లో అత్యధిక పర్యాయాలు మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డు పొందిన క్రికెటర్. (15 సార్లు)

అతిపిన్న వయస్సులో (16 ఏళ్ళ వయసు) వన్డే క్రికెట్ ఆడిన భారతీయుడు.

అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్. (18426 పరుగులు)

10000, 11000, 12000, 13000, 14000, 15000, 16000 17000, 18000 పరుగులు పూర్తిచేసిన తొలి ఆటగాడు.

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 7 సార్లు సాధించాడు.

ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, న్యూజీలాండ్, శ్రీలంక, జింబాబ్వేలపై అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్.

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక పరుగులు. (1894 పరుగులు)

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక సెంచరీలు. (9 సెంచరీలు)

రాహుల్ ద్రవిడ్తో కలిసి అత్యధిక పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు. (331 పరుగులు )

సౌరవ్ గంగూలీతో కలిసి అత్యధిక ఓపెనింగ్ పాట్నర్‌షిప్ రికార్డు. (6609)

అత్యధిక సార్లు 200 మించి పాట్నర్‌షిప్ పరుగులు. (6 సార్లు)

వన్డేలలో డబుల్ సెంచరీ సాధించిన తొలి ఆటగాడు.

2011 వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యుడు.

టెస్ట్ రికార్డులు:

పిన్న వయస్సులో టెస్ట్ క్రికెట్ ఆడిన భారతీయుడు.

టెస్ట్ క్రికెట్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్. (51 సెంచరీలు)

టెస్ట్ క్రికెట్‌లోఅత్యధిక అర్థసెంచరీలు సాధించిన భారతీయ బ్యాట్స్ మెన్. (67అర్థ సెంచరీలు)

20 సంవత్సరాల వయస్సులోనే 5 టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్.

కెప్టెన్‌గా ఇన్నింగ్సులో అత్యధిక పరుగులు చేసిన భారతీయుడు. (217 పరుగులు)

అన్ని టెస్టు ఆడే దేశాలపై సెంచరీలు సాధించిన తొలి భారతీయుడు.

అత్యధిక టెస్టులు ఆడిన భారతీయ క్రికెటర్. (200 టెస్టులు)

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్. (15837)

అతివేగంగా 10 వేల పరుగులు పూర్తి చేసిన భారతీయ బ్యాట్స్‌మెన్. (195 ఇన్నింగ్సులలో)

12000, 13000, 14000, 15000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మెన్.

విదేశాలలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్.

ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చొప్పున 5 సార్లు సాధించిన తొలి భారతీయ బ్యాట్స్‌మెన్‌.