నియంత్రిత సాగు విధానానికి ముగింపు పలికిన కేసీఆర్

తెలంగాణలో నియంత్రిత సాగు విధానంతో ఈ రకం పంటలే వేయాలని రైతులకు ఆంక్షలు పెట్టిన సీఎం కేసీఆర్.. ఇకపై రాష్ట్రంలో నియంత్రిత సాగు విధానం అవసరం లేదని స్పష్టం చేశారు. ఆదివారం ప్రగతి భవన్‌లో వివిధ రకాల పంటల కొనుగోళ్లు సహా ఇతర సాగు అంశాలపై సమీక్ష జరిగిన సీఎం.. పంటల నియంత్రణ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రైతులు ఏ పంట వేయాలో ఇకపై వాళ్లదే నిర్ణయమని పేర్కొన్నారు. పంటల విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి మార్గదర్శకాలు ఉండవన్నారు. పంట కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయం చట్టాకు అనుగుణంగా రైతులు పంటకు ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడే అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా నియంత్రిత సాగు విధానం రాష్ట్రంలో తొలినుంచీ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై విపక్షాలతో సహా.. రైతుల సంఘాల నేతలు సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే గ్రామాల నుంచి పంట కొనుగోళ్ల కేంద్రాలను తొలగించాలన్న నిర్ణయంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఎత్తివేస్తే దళారులకు తక్కువకు అమ్ముకొని నష్టపోయే ప్రమాదం ఉంది. కేసీఆర్ నిర్ణయాలపై ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా, మొన్నటి వరకూ సన్నరకం వరి వేయాలని.. మొక్కజొన్న తగ్గించాలని.. పప్పు ధాన్యాలు పెంచాలంటూ తెలంగాణ రైతుల ముందరి కాళ్లకు బంధాలు వేశారు. దీంతో ఈసారి కేసీఆర్ చెప్పినట్టే తెలంగాణలో రైతాంగం పంటలు వేసింది. అయితే దీనిపై రైతుల్లో మేధావులు, రాజకీయ పక్షాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే వారి నేల స్వభావం, పంటలు ఏం వేయాలో రైతులకే బాగా తెలుసు. అలాంటిది కేసీఆర్ నియంత్రించడం వ్యతిరేకతను పెంచింది. దీంతో పాటు ఇటీవల ఎన్నికల్లో కేసీఆర్ కు ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ దెబ్బతో కేసీఆర్ వెనక్కి తగ్గేలా చేసాయి.