‘స్విచ్ ఢిల్లీ’ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీలో రోజురోజుకు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, కాలుష్య రహిత వాహనాల గురించి అవగాహన కల్పించేందుకు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం ‘స్విచ్ ఢిల్లీ’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలుష్యాన్ని నియంత్రించేందుకు.. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇకపై వాహనం కొనుగోలు చేయాల్సి వస్తే ఢిల్లీ వాసులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని సూచించారు.

2024 నాటికి ఢిల్లీలో 25% విద్యుత్ వాహనాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు ద్విచక్ర, త్రిచక్ర విద్యుత్ వాహనాలకు 30 వేల రాయితీ, 4 చక్రాల విద్యుత్ వాహనాలకు రూ .1.5 లక్షలు రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. విద్యుత్ వాహనాలకు రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండవని కేజ్రీవాల్ ప్రకటించారు. విద్యుత్ వాహనం కొనుగోలు చేసిన మూడు రోజుల్లోనే వాహనదారుల ఖాతాలో సబ్సిడీ నగదు జమవుతుందని తెలిపారు. కాలుష్యాన్ని పెంచే వాహనాలకు విముక్తి పలికి ఎలక్ట్రిక్ వాహనాలకు స్విచ్ కావాలని, కాలుష్య నియంత్రణలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలని సీఎం కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.