పంజాబ్ ప్రజలకు ‘ఉచిత విద్యుత్’ హామీ నిచ్చిన కేజ్రీవాల్

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న పంజాబ్‌లో పాగా వేయాలని గట్టి పట్టుదలగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడి ప్రజలకు అదిరిపోయే హామీ ఇచ్చారు. ఎన్నికల్లో కనుక తమ పార్టీని గెలిపిస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని నిన్న ప్రకటించారు. పెరుగుతున్న ధరల వల్ల పంజాబ్ మహిళలు సంతోషంగా లేరన్న కేజ్రీవాల్.. ఢిల్లీలో తాము 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ పంజాబీలో ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ నేడు చండీగఢ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన చేసిన ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు, ఆప్ అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ నేడు చండీగఢ్‌లో ‘పెద్ద ప్రకటన’ చేయబోతున్నట్టు చెప్పారు. కేజ్రీవాల్ చేయబోయే ప్రకటన ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన పార్టీలో 440 వోల్టుల విద్యుత్‌ను ప్రవహించేలా చేస్తుందని అన్నారు. ఆ భయంతోనే పంజాబ్ భవన్‌లో కేజ్రీవాల్ ఏర్పాటు చేయాలనుకున్న విలేకరుల సమావేశానికి అనుమతి నిరాకరించారని అన్నారు. అయితే, ఈ ఆరోపణలను అమరీందర్ కొట్టిపడేశారు. ఈ వార్తల్లో నిజం లేదని, అవసరమైతే కేజ్రీవాల్‌కు తాను లంచ్ కూడా ఏర్పాటు చేస్తానని అన్నారు.