వ్యాక్సినేషన్‌ విషయంలో కేరళ సర్కార్‌ కీలక నిర్ణయం!

టీకా వేయించుకున్నవారినే అనేక దేశాలు తమ దేశంలోకి అనుమతిస్తున్న నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 నుంచి 45 ఏళ్ల వయసు వారికి వ్యాక్సినేషన్‌లో విదేశాల్లో విద్య, ఉద్యోగం కోసం వెళ్లాలనుకునే వారికి ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. విద్య, ఉపాధి కోసం వచ్చేవారికి అనేక దేశాలు వ్యాక్సినేషన్‌ తప్పనిసరి చేయడంతో తక్షణమే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. వీరితో పాటు మరో 10 కేటగిరీలను కూడా ప్రాధాన్యతా గ్రూపులో చేరుస్తూ ఉత్తర్వులు జారీచేసినట్టు తెలిపారు. పరీక్షల వాల్యుయేషన్‌కు హాజరయ్యే ఉపాధ్యాయులతో పాటు ఆహార- పౌరసరఫరాలశాఖ, పోస్టల్‌, సామాజిక న్యాయం, మహిళా, శిశు సంక్షేమం, మత్స్యశాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖలలో క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందిని ప్రియారిటీ గ్రూపులో చేర్చినట్టు వివరించారు.

వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్య గ్రూపులో మరి కొన్ని వర్గాలను కూడా చేర్చాలన్న డిమాండ్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రస్థాయి కమిటీ సూచనల ఆధారంగా కొత్తగా 11 కేటగిరీలను చేర్చామన్నారు. 18 నుంచి 44 ఏళ్ల వయసు వారిలో ప్రాధాన్యతా గ్రూపులుగా గుర్తించిన వారికి మే 17న వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. ఈ వయసు వారిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మరోవైపు, వ్యాక్సినేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో మార్గదర్శకాలను విడుదల చేసింది.