భారత్‌కు ఖోస్లా మరో 10 మి.డాలర్ల విరాళం

కరోనాతో కొట్టుమిట్టాడుతున్నభారత్‌కు భారత సంతతికి చెందిన బిలియనీర్‌, సన్‌ మైక్రోసిస్టమ్స్‌ సహ వ్యవస్థాపకుడు వినోద్‌ ఖోస్లా కుటుంబం మరో 10 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సమకూర్చేందుకు వీటిని అందించనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని వినోద్‌ ఖోస్లా ఆదివారం ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. గతంలోనే ఈయన వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వసతుల కల్పనకు విరాళాలు అందజేశారు. దానికి తాజాగా ప్రకటించిన 10 మిలియన్ డాలర్ల అదనం కావడం విశేషం.

”భారత్‌లో కొవిడ్‌ సహాయార్థం గివ్‌ఇండియాకు ఇస్తున్న ఈ విరాళాలు సరిపోవు. 20 వేల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్లు, 15 వేల సిలిండర్లు, 500 ఐసీయూ బెడ్లు, 100 వెంటిలేటర్లు, 10 వేల పడకల సామర్థ్యంతో కొవిడ్‌ కేంద్రాల నిర్వహణ కోసం వారికి దేశవ్యాప్తంగా ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థల నుంచి ప్రతిరోజు విజ్ఞప్తులు అందుతున్నాయి. మనం చేయాల్సింది చాలా ఉంది. గతంలో ఇచ్చిన విరాళాలకు అదనంగా మరో 10 మిలియన్‌ డాలర్లను ఇవ్వాలని ఖోస్లా కుటుంబం నిర్ణయించింది. ఇతరులు కూడా ఈ క్రతువులో భాగమవుతారని ఆశిస్తున్నాం. ఇంకా సాయం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఆలస్యమవుతున్న కొద్దీ ప్రాణాలు పోతున్నాయి. ఒక రోజు ఒక ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక 8 మంది మరణించారు!” అని ఖోస్లా ట్విటర్‌ వేదికగా తెలిపారు.

భారత్‌లో కరోనా వికటాట్టహాసం చేస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,68,147 మందికి పాజిటివ్‌గా తేలారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1.99కోట్లకు చేరింది. తాజాగా 3,417 మంది కొవిడ్ వల్ల మృత్యువాతపడ్డారు. మహమ్మారి దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటి వరకు 2,18,959 మంది వైరస్‌కు బలైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.