కోహ్లీ వ్యాఖ్యలు సరైనవి కావు: ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌

అహ్మదాబాద్‌: మొతేరా పిచ్‌ బ్యాటింగ్‌కు అత్యంత అనుకూలమైనదేనని, బ్యాట్స్‌మెన్ల వైఫల్యం వల్లే ఇరు జట్లు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాయని, ఆటగాళ్లు నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తే సరిపోతుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చేసిన వ్యాఖ్యలను ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అలిస్టర్‌ కుక్‌ ఖండించారు. ఈ వికెట్‌ ఎంతమాత్రమూ బ్యాటింగ్‌కు అనువైనది కాదని, ఇటువంటి పిచ్‌పై ఆడటం ఎంతో కష్టమని వ్యాఖ్యానించాడు. ఇది అసలు పిచ్‌ కాదని, వికెట్‌ అంచనా తప్పని వ్యాఖ్యానించిన ఆలిస్టర్‌.. విరాట్‌ కోహ్లీ పిచ్‌ తయారు చేసిన వారికి అనుకూలంగా మాట్లాడారని ఆరోపించారు. ఇదే మ్యాచ్‌లో ఇండియా మొదట బ్యాటింగ్‌ చేసుంటే అప్పుడు కూడా విరాట్‌ ఇలాగే మాట్లాడి వుండేవాడా? అని ప్రశ్నించారు. కేవలం తొలి ఇన్నింగ్స్‌లో మాత్రమే ఈ వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలించిందన్న కోహ్లీ మాటలను సైతం కుక్‌ ఖండించాడు. వేసిన ప్రతి బాల్‌ స్కిడ్‌ అవుతుంటే ఎలా ఆడతారని, తనకు తెలిసిన ఇండియాలోని క్రికెట్‌ పిచ్‌లతో పోలిస్తే.. ఈ పిచ్‌పై రెడ్‌ బాల్‌ ఎంతో తిరిగిపోయిందని అన్నారు. ఇక మూడో టెస్ట్‌లో ఓడిపోయిన ఇంగ్లాండ్‌కు మద్దతుగా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. టెస్టులకు ఎంత మాత్రమూ పనికిరాని పిచ్‌లను తయారు చేశారని ఆరోపించారు.