ప్లేఆఫ్‌ రేసులో నిలచిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌

ఆదివారం రాత్రి జరిగిన కీలక మ్యాచ్‌లో కోల్‌కతా సత్తా చాటింది. ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతా అదరగొట్టి.. 60 పరుగుల తేడాతో రాజస్థాన్‌పై కోల్‌కతా ఘన విజయం సాధించి ప్లేఆఫ్‌ రేసులో నిలిచింది. దీంతో రాజస్థాన్‌ టోర్నీ నుంచి సైడయ్యింది. కోల్‌కతా నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ దారుణంగా తడబడింది. పేసర్‌ పాట్‌ కమిన్స్‌(4/34), వరుణ్‌ చక్రవర్తి(2/19) దెబ్బకు టపటపా వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో శివమ్‌ మావి(2/15) విజృంభించడంతో 20 ఓవర్లలో రాజస్థాన్‌ 9 వికెట్లకు 131 పరుగులకే పరిమితమైంది. జోస్‌ బట్లర్‌(35 22 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) అత్యధిక పరుగులు చేశాడు. చివర్లో రాహుల్‌ తెవాటియా(31) కొంతసేపు పోరాడటంతో ఓటమి అంతరం మాత్రమే తగ్గింది.

ముందుగాసారథి ఇయాన్‌ మోర్గాన్‌(68 నాటౌట్: 35 బంతుల్లో 5ఫోర్లు, 6సిక్సర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 191 రన్స్ చేసింది. శుభ్‌మన్‌ గిల్‌(36: 24 బంతుల్లో 6ఫోర్లు), రాహుల్‌ త్రిపాఠి(39: 34 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) ఆకట్టుకున్నారు. రాహుల్‌ తెవాటియా(3/25) సంచలన ప్రదర్శనతో కోల్‌కతాను బాగా ఇబ్బంది పెట్టాడు. కార్తీక్‌ త్యాగీ రెండు వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్‌, శ్రేయస్‌ గోపాల్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.