ఏపీ హైకోర్టును ఆశ్రయించిన కృష్ణం రాజు, అశ్వనీదత్

ప్రముఖ టాలీవుడ్ నటుడు కృష్ణం రాజుతోపాటు నిర్మాత అశ్వినీదత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు ఇచ్చిన భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని.. వాటికి తగిన నష్టపరిహారం చెల్లించాలని పిటీషన్లు దాఖలు చేశారు.

గన్నవరం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు అప్పటి ప్రభుత్వం తన 31 ఎకరాల భూమిని తీసుకుందని కృష్ణంరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంతలోనే మరో ప్రభుత్వం అధికారంలోకి రావడం.. రాజధాని తరలింపుకు సిద్దమైన నేపథ్యంలో.. నష్టపరిహారం చెల్లింపుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

గన్నవరం ఎయిర్‌పోర్టు విస్తరణ కోసం తనకు చెందిన 39 ఎకరాల భూమిని కూడా అప్పటి ప్రభుత్వం తీసుకుందని నిర్మాత అశ్వనీదత్ పిటిషన్‌లో పేర్కొన్నారు. భూసేకరణ చట్టం 2013 ప్రకారం నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఎకరా రూ.1కోటి 54లక్షలు ఉంటుందని… దానికి సరిసమానమైన భూమిని అమరావతిలో ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. కానీ ఇప్పుడు రాజధాని తరలింపుతో అక్కడ విలువ పడిపోయిందని… కాబట్టి తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. మొత్తం రూ.210కోట్లు ప్రభుత్వం తనకు పరిహారంగా చెల్లించాలన్నారు.

ఇరువురి పిటిషన్లను విచారణకు స్వీకరించిన కోర్టు… కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

గత టీడీపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద గన్నవరం ఎయిర్ పోర్టు కోసం 760 ఎకరాల భూమిని సేకరించింది. ఎకరం రూ.2 కోట్లు మార్కెట్ విలువ కలిగిన ఈ భూములను తీసుకొని అమరావతి రాజధానిలో ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ జగన్ సర్కార్ మూడు రాజధానులను మార్చి విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతో నష్టపోయిన ల్యాండ్ ఫూలింగ్ బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.