పలు అభివృద్ధి పనులు, సమస్యలను కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ దృష్టికి తీసుకెళ్ళిన కేటీఆర్

సోమవారం తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలోని నిర్మల్ భవన్‌లో పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీనికలిసి భేటి అయ్యారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణలో పట్టణాభివృద్ధి శాఖ, విమానయాన శాఖకు సంబంధించిన అభివృద్ధి పనులు, సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన 2537.81 లక్షల నిధులను విడుదల చేయాల్సిందిగా కేంద్ర మంత్రి కోరామ‌ని చెప్పిన మంత్రి కేటీఆర్.. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన పురపాలక చట్టం అంశాలను ఆయనకు వివరించాన‌ని అన్నారు. తాము చెప్పిన అంశాలన్ని విన్న కేంద్ర మంత్రి… వెంటనే సంబంధిత అధికారులను పిలిచి ఆయా అంశాలను పరిశీలించాల్సిందిగా ఆదేశించారని.. అందుకు ముందుగా ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని చెప్పారు. అలాగే అక్టోబర్‌లో మరోసారి పూర్తి నివేదికతో రావాలని.. అవసరమైతే అందులోని అంశాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయించే ఏర్పాట్లు చేద్దామని కేంద్ర మంత్రి సూచించార‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు.

స్వచ్ఛ భారత్ నిధులు, అమృత్ పథకం నిధులు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ కింద రావాల్సి ఉన్న 784 కోట్ల నిధులు విడుదల చేయాలని కేంద్రమంత్రిని కోరామ‌ని చెప్పిన మంత్రి కేటీఆర్.. అలాగే డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ నిర్మాణం  పథకాల నిర్వహణ కోసం ఇవ్వాల్సిన రూ.1184 కోట్ల నిధులు సైతం విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్టు పేర్కొన్నారు.

వరంగల్‌లోని మామునూరు ఎయిర్ పోర్టును ఉడాన్ పథకంలో చేర్చి తిరిగి ఉత్తర తెలంగాణ ప్రజానికానికి విమానసేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరగా.. అందుకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ సానుకూలంగా స్పందిస్తూ త్వరలో కేంద్ర బృందాన్ని పంపించి అధ్యయనం చేయిస్తామన్నారని తెలిపారు. కేంద్ర మంత్రి స్పందించిన తీరు చూస్తే.. త్వరలోనే వరంగల్ ప్రజలకు విమాన సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. కేంద్ర మంత్రితో భేటీలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ కూడా పాల్గొన్నారు.