హైదరాబాద్‌లో ఐపిఎల్‌ లేనట్టేనా? బిసిసిఐకి కెటిఆర్‌ బంపర్‌ ఆఫర్‌..!

న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాల క్రికెట్‌ అభిమానులకు ఇది చేదు వార్త.. ఐపిఎల్‌ 2021 సీజన్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈసారి కూడా లేనట్లు ఉంది. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ లీగ్‌.. చివరికి యుఎఇలో నిర్వహించారు. ఈ ఏడాది ఐపిఎల్‌ స్వదేశంలోనే జరగబోతోంది. కానీ, కరోనా నేపథ్యంలో బిసిసిఐ షార్ట్‌లిస్ట్‌ చేసిన వేదికల జాబితాలో హైదరాబాద్‌కు చోటు దక్కలేదు. ఈసారి ఐసిఎల్‌ మ్యాచ్‌లను 6 వేదికలకే పరిమితం చేయనున్నట్లు బోర్డు వర్గాల సమాచారం. ప్రస్తుతానికి చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, ముంబైలను మాత్రమే వేదికలుగా ఎంపిక చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ముంబై స్టేడియంలో ప్రేక్షకుల్లేకుండా మ్యాచ్‌లు నిర్వహించుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ముంబైలో సాధ్యం కాని పక్షంలో హైదరాబాద్‌లో నిర్వహించాలని భావించినట్లు సమాచారం. కానీ, ముంబైలో మ్యాచ్‌లకు అనుమతి లభించడంతో హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది.

అయితే, గతంలో మాదిరి వేర్వేరు జట్లు వేర్వేరు వేదికల్లో తలపడటం కాకుండా.. జట్లన్నింటినీ ఒకే చోట ఉంచి ఒక స్టేడియంలో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించి.. తర్వాత మరో స్టేడియంలో మరికొన్ని మ్యాచ్‌లు నిర్వహించేలా బోర్డు ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఇలా అయితేనే క్వారంటైన్‌ నిబంధనలు పాటించడానికి వీలుంటుందని భావిస్తున్నారట. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రూపుదిద్దుకున్న మొతేరాలో ఐపిఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తే లీగ్‌కే కళ వస్తుందన్న ఉద్దేశంతో అహ్మదాబాద్‌ కేంద్రంగా ఏ ఫ్రాంఛైజీ లేకపోయినా దాన్ని ఒక వేదికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. పై రెండు నిర్ణయాల్లో ఏ నిర్ణయం ఫైనల్‌ అయినా.. హైదరాబాద్‌, జైపూర్‌, మొహలీల్లో క్రికెట్‌ అభిమానులు తమ హోం స్టేడియాల్లో ప్రత్యక్షంగా క్రికెట్‌ను చూసే అవకాశం కోల్పోనున్నారు.

బిసిసిఐకి కెటిఆర్‌ బంపర్‌ ఆఫర్‌..

ఈఏడాది నిర్వహించే ఐపిఎల్‌ మ్యాచ్‌ల వేదికల జాబితాలో హైదరాబాద్‌ లేదని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో ఈ విషయమై మంత్రి కెటిఆర్‌ స్పందించారు. బిసిసిఐతో పాటు ఐపిఎల్‌కు ఓ ఆఫర్‌ ఇచ్చారు. 2021 సీజన్‌ ఐపిఎల్‌ మ్యాచ్‌లను హైదరాబాద్‌లో కూడా నిర్వహించాలని కోరిన కెటిఆర్‌.. మ్యాచ్‌ల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో పాటు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా దేశంలోనే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు హైదరాబాద్‌లో నమోదవుతున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు.