నింగికేగిన పిఎస్‌ఎల్‌వి సి- 51.. ప్రయోగం విజయవంతం!

ఎన్నెన్నో మైలురాళ్లను సాధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో).. మరో ఘనతను సాధించింది. ఇస్రో ఆధ్యర్యంలో నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహకనౌక-సి51 (పిఎస్‌ఎల్‌వి)ని నింగిలోకి ప్రయోగించారు. ఆదివారం ఉదయం 10.24 గటలకు రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌ ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా-1తోపాటు మనదేశానికి చెందిన 18 ఉపగ్రహాలను పంపించారు. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా విదేశీ, ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. 14 విదేశీ, ప్రైవేట్‌ సంస్థలు రూపొందించిన ఆనంద్‌, సతీశ్‌ ధావన్‌, యునిటీశాట్‌ వంటి ఐదు ఉపగ్రహాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటి వరకు 3 దశలు విజయవంతమయ్యాయి. ప్రయోగం నేపథ్యంలో షార్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. బ్రెజిల్‌ దేశ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి మార్కోస్‌ క్వాంటస్‌ షార్‌కు చేరుకుని ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఇది ఇస్రో ఈ ఏడాది చేపట్టిన మొదటి ప్రయోగం. ఈ ప్రయోగానికి సంబంధించి కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శనివారం ఉదయం 8.54 గంటలకు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కౌంట్‌డౌన్‌ దాదాపు 25 గంటలపాటు నిరంతరాయంగా కొనసాగి ఈరోజు ఉదయం 10.24 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది.