దుబ్బాక ఫలితం పై స్పందించిన కేటీఆర్

దుబ్బాక స్థానానికి హోరాహోరీగా జరిగిన ఉప ఎన్నికలో ఆ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. దుబ్బాక ఎన్నిక ఫలితాలు విడుదలైన వెంటనే తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఫలితం తాము ఆశించిన విధంగా రాలేదని అన్నారు. ఆ స్థానంలో ప్రజలు ఇచ్చిన తీర్పే తమకు శిరోధార్యం అని అన్నారు. భవిష్యత్తు కార్యాచరణ ప్రకారం తమ పని తాము చేసుకుంటూ ముందుకెళ్తామని పేర్కొన్నారు. గత ఆరున్నరేళ్లుగా ప్రతి ఎన్నికలలో తెరాస విజయాలు సాధిస్తూ వచ్చిందన్న ఆయన విజయాలతో పొంగిపోవడం, ఓటమితో కుంగిపోవడం టీఆర్ఎస్ కు అలవాటు లేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటు వేసిన 61,320 మంది ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమిటనే దానిపై సమీక్షించుకుంటామన్నారు.