చంద్రశేఖర్ ఆజాద్ కు వందనాలు

నీ పేరేంటి..? ‘ఆజాద్’ (స్వేచ్ఛ)! నీ తండ్రి పేరేంటి..? ‘స్వాతంత్రం’ అని బోనులో నిలబడిన పదిహేనేళ్ల బాలుడు న్యాయ పీఠంపై ఉన్న న్యాయమూర్తికి బదులిచ్చాడంటే ఆ బాలుడు ఎంతటి ధీరుడో ఆ తరువాత భారతావనికి అవగతమైంది. అతనే ఆజాద్ గా కీర్తిగాంచిన చంద్రశేఖర్ సీతారాం తివారీ. బ్రిటీష్ పాలకులపై ఉవ్వెత్తున ఎగిసిపడిన విప్లవ కెరటం ఆజాద్. ఆ మహా వీరుని జయంతి సందర్భాన ముకుళిత హస్తాలతో అంజలి ఘటిస్తున్నానంటూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం స్పూర్తితో తాను చదువుతున్న సంస్కృత పాఠశాల వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న తరుణంలో చంద్రశేఖర్ సీతారాం తివారీని బ్రిటీష్ పోలీసులు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అప్పటికి చంద్రశేఖర్ వయస్సు కేవలం పదిహేనేళ్ళు మాత్రమే. అయితే న్యాయమూర్తి నీ పేరేంటని అడిగినప్పుడు ‘నా పేరు ఆజాద్’ అని ఒక్కింత పౌరుషంగా బదులివ్వడంతో న్యాయమూర్తి ఆతనికి 24 వారాల జైలు శిక్ష విధించడం, అప్పటి నుంచి చంద్రశేఖర్ ఆజాద్ గా కీర్తినొందటం భారతావనికి విదితమే. భరత జాతి స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం అజ్ఞాతంగా పోరు సలిపిన ఆజాద్ స్వతంత్ర సంగ్రామ చరిత్రలో స్థిరంగా నిలిచిపోయారు. దేశం కోసం పోరాడుతూ ఉరిశిక్షకు గురైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురులను రక్షించుకోడానికి బ్రిటిష్ పోలీసులపై పోరాడుతూ చివరికి వారి నుంచి తప్పించుకోడానికి తుపాకీతో తనకు తానే కాల్చుకున్న ఆ వీరుని ధైర్యసాహసాలు రోమాంచితంగా ఉంటాయి. పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఆజాద్ త్యాగం ఈ పుణ్యభూమి ఎన్నటికీ మరవదు. ఆ త్యాగమూర్తికి నా పక్షాన, జనసేన పక్షాన వందనాలు అర్పిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.