Vijayanagaram: కురుపాం స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన సర్పంచ్ సహా గ్రామం మొత్తం జనసేన జెండా పట్టారు

జనసేన సిద్ధాంతాలు నచ్చి, జనసేనాని చేస్తున్న సమస్యల మీద పోరాటానికి ప్రభావితమై గ్రామ సర్పంచ్ జనసేనలో చేరిక. విజయనగరం జిల్లాలో మారు మూల నియోజకవర్గంగా పేరున్న కురుపాంలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన ఓ సర్పంచ్ సహా గ్రామం మొత్తం జనసేన జెండా పట్టేలా చేసింది. ఆదివారం వీరంతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని చేతుల మీదుగా జనసేన కండువాలు కప్పించుకున్నారు. కురుపాం నియోజకవర్గం పరిధిలోని చినఖేర్జిల గ్రామ పంచాయితీకి రాజకీయ చైతన్యం గల ఊరుగా పేరుంది. సర్పంచ్ ఎన్నికల్లో అక్కడ అధికార పార్టీ బలపర్చిన అభ్యర్ధిని కూడా కాదని స్వతంత్ర అభ్యర్ధికి పట్టం కట్టడం అందుకు నిదర్శనం. ఇప్పుడు జనసేన పార్టీ వైపు చినఖేర్జిల నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించిన శ్రీ హిమరక గంగాధర్, అదే గ్రామానికి చెందిన 300 కుటుంబాలు ఆకర్షితులయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీ పాలూరి బాబు ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన జెండా స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గ నాయకులు శ్రీమతి గార గౌరీ, శ్రీ శ్రీరామ్, శ్రీ వంశీ, శ్రీ రాజా, శ్రీ మల్లేష్, శ్రీ సంజు, శ్రీ రాజేష్, శ్రీ శివ తదితరులు పాల్గొన్నారు.