వైఎస్‌ఆర్‌ బీమా పథకం ప్రారంభం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ మరో కీలక ముందడుగు వేసి.. నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా బీమా సదుపాయం కల్పిస్తారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 1.41 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు.

బీమా నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పకున్నా భరించేందుకు సిద్దమయ్యామని స్పష్టం చేశారు. 18- 50 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.5లక్షలు, 51-70 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3లక్షలు, సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాదవశాత్తూ పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.50లక్షల బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రమాదవశాత్తూ చనిపోతే తక్షణమే రూ.10వేలు అందిస్తామని సీఎం చెప్పారు. కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని, కుటుంబంలో ఎవరికైనా ఆపదవస్తే ఆదుకోవడం కోసమే ఈ పథకం ప్రారంభించినట్టు సీఎం వెల్లడించారు. జాబితాలో పేర్లు లేనివారు గ్రామ సచివాలయానికి వెళ్లి నమోదు చేసుకోవచ్చని సూచించారు. రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జయరాం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.