ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని స్మరించుకొన్న శాస‌న‌స‌భ

తెలంగాణ శాస‌న‌స‌భ సమావేశాలలో భాగంగా నేడు సభలో మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ప్ర‌ణ‌బ్ ముఖర్జీ మృతి ప‌ట్ల ముఖ్యమంత్రి కేసిఆర్ స‌భ‌లో సంతాప తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్ర‌ణ‌బ్ ముఖర్జీ మృతి ప‌ట్ల తెలంగాణ శాస‌న‌ స‌భ తరపున ఆయ‌న కుటుంబస‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేస్తున్నామ‌ని అన్నారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతి దేశానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తంచేసిన కేసీఆర్.. దేశం మహోన్నత నాయ‌కుడిని కోల్పోయిందని అన్నారు. 1970 త‌ర్వాత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిలో పెట్టారని… అందుకే ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి దేశాభివృద్ధిలో ప్ర‌త్యేక స్థానం ఉందని కేసీఆర్ గుర్తుచేశారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, అంకుటిత దీక్ష, అంకిత‌భావంతోనే ప్రణబ్ ఉన్నత స్థానానికి ఎదిగారు అని సీఎం కేసీఆర్ కీర్తించారు.

ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాజకీయాల్లో అత్యంత కాలం కొనసాగి నప్పటికీ.. ప్ర‌తిప‌క్షాల‌ను వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శించని ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రణబ్‌ది అని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. కఠిన స‌మ‌స్య‌లను సైతం సామ‌ర‌స్యంగా ప‌రిష్క‌రించే రాజనీతిజ్ఞుడిగా, మిత్ర ప‌క్షాల‌ను క‌లుపుకుని పోవ‌డంలో సమర్ధుడిగా ఆయ‌నకు పేరుందని అభిప్రాయపడ్డారు. దేశానికి ప్రణబ్ అందించిన సేవ‌ల‌కు గుర్తింపుగా 2019లో కేంద్రం ఆయన్ను భార‌త‌ర‌త్న అవార్డుతో సత్కరించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు స‌హాయపడటమే కాకుండా.. రాష్ట్ర విభ‌జ‌న బిల్లుకు ఆమోదం తెలిపి తెలంగాణ చ‌రిత్ర‌లోనూ ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు అని కొనియాడారు.