మళ్లీ సెలబ్రేట్‌ చేసుకుందాం: సాయి తేజ్

లాక్‌డౌన్ అనంతరం ఇటీవల 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లని రీఓపెన్ చేసుకోవచ్చంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ రోజు మూవీ థియేటర్స్ రీఓపెన్ అయ్యాయి. ఎంతో కాలంగా థియేటర్లని మిస్ అవుతున్న సెలబ్రిటీలు మల్టీప్లెక్స్‌ల బాటపట్టారు. ఇందులో భాగంగా ప్రేక్షకుల్ని సినిమా థియేటర్లకు ఆహ్వానిస్తూ మేగా మేనల్లుడు సాయి తేజ్ ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశారు.

థియేటర్‌లు తెరుచుకోవడంతో హీరో సాయి‌ తేజ్ ఆనందం వ్యక్తం చేసి.. సినిమా చూసేందుకు వెళ్ళాడు. ప్రసాద్‌ మల్టీప్టెక్స్‌ ఐమ్యాక్స్‌లో ఇవాళ విడుదలైన ‘టెనెట్’ సినిమా చూసేందుకు వెళుతున్న వీడియోను ట్వీటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. దాదాపు ఎనిమిది నెలల తర్వాత వెండితెరపై సినిమా చూడటం కొత్త అనుభూతిని ఇస్తుందని ఆనందం వ్యక్తం చేశాడు. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తిరిగి థియేటర్లకు రావాలని కోరాడు. ‘చాలాకాలం తర్వాత థియేటర్‌కు రావడం సంతోషంగా ఉంది. బిగ్‌స్రీన్‌పై సినిమాను చూడటమంటేనే అద్భుతమైన వినోదం. చాలామంది కూడా ఇలానే భావిస్తారు. సినిమాను మళ్లీ సెలబ్రేట్‌ చేసుకుందాం’ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే థియేటర్‌కు వచ్చే ముందు ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్‌లు ధరించాలని, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజ్‌ చేసుకోవాలని తేజ్‌ సూచించాడు. సాయి తేజ్ నటించిన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమా డిసెంబర్ నెలలో విడుదల కాబోతోంది. ఈ మూవీ వీక్షణకు ఎలాంటి ఢోకా లేకుండా ప్రచారం పరంగా తేజ్ హీట్ పెంచుతున్నాడు.