రౌడీరాజ్యం చేస్తానంటే చూస్తూ ఊరుకోం: మండలి రాజేష్

అవనిగడ్డ, ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న దివిసీమలో రౌడీరాజ్యం చేస్తానంటే చూస్తూ ఊరుకోమని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్ అన్నారు. శనివారం అవనిగడ్డలో జనసేన-తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో తలపెట్టిన బంద్ సక్సెస్ కావడంతో అక్కసుతో పోలీసు వ్యవస్థతో అక్రమంగా అరెస్ట్ చేయడంపై జనసేన నేతలు మండిపడ్డారు. అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే వీధిరౌడీలా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించడానికి వెళ్లిన జనసేన కార్యకర్తలను, వీర మహిళలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అసభ్యపదజాలంతో దుర్భాషలాడుతూ, కర్రలతో కొట్టి గాయపరచడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని అన్నారు. గత ఏడాది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అవనిగడ్డ నియోజకవర్గానికి 93.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు అంగీకారం తెలిపి, ప్రకటించడంతో నిజంగా అభివృద్ధి జరుగుతుందని ప్రజలందరూ సంతోషించి ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలభిషేకాలు చేసారని, కానీ ఏడాది గడిచినా ఒక్క రూపాయి పనులు కూడా జరుగకుండా ప్రజలను మోసం చేసారని అన్నారు. ఇదే విషయంపై స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుకు గుర్తుచేయడానికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో మహా ధర్నాకు పిలుపునిస్తే, ఎమ్మెల్యే మహిళలు అని కూడా చూడకుండా తన అనుచరులతో కొట్టించడం హేయమైన చర్యగా తెలిపారు. పైగా మేము దాడి చేయలేదు అని వైసీపీ పార్టీ వారితో ప్రెస్ మీట్లు పెట్టించడం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. శనివారం బంద్ నేపథ్యంలో అవనిగడ్డ మండల అధ్యక్షులు గుడివాక శేషుబాబుని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తమ నేత నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారని తెలిపారు. మరలా ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అవనిగడ్డకు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ, జిల్లా ఎస్పీలకు జనసేన, టీడీపీ కార్యకర్తలపై దాడి ఎవరు చేశారో తెలుసుకుని, నిందితులపై తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఎంతో ధైర్యంతో వైసీపీ మూకలకు ఎదురు నిలబడిన గుడివాక శేషుబాబును, జనసేన వీరమహిళలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామ్, నేతలు కొరియర్ శ్రీను, చందు పవన్, గళ్లా తిమోతి, తాడిశెట్టి నరేష్, జనసేన పార్టీ వీర మహిళలు, జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.