సాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి భగత్‌ను అడ్డుకున్న స్థానికులు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ

ప్రచారానికి వెళ్లిన నాగార్జునసాగర్ టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను స్థానికులు అడ్డుకోవడంతో నల్గొండ జిల్లా అనుమలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకానొక సమయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు ఒకరినొకరు నెట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ రేకెత్తింది.

ఈ క్రమంలో కాంగ్రెస్ శ్రేణులపై దాడిచేశారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి తనయుడు జయవీర్ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కల్పించుకున్న పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వడం, ఓ కానిస్టేబుల్ తలకు గాయం కావడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ రంగనాథ్ పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులను భారీగా మోహరించారు.