లాక్‌డౌన్‌: పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్.. 4 గంటలే

కరోనా నేపథ్యంలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ప్రజా రవాణా కోసం ఇబ్బంది లేకుండా నగరంలో ఆర్టీసీ సిటీ బస్సులను నడుపాలని నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 29 డిపోలలో ప్రజల డిమాండ్‌ను బట్టి ఉదయం 6 నుంచి 10 గంటల లోపు సిటీ బస్సులను నడుపుతామని ఆర్టీసీ జీహెచ్‌ఎంసీ జోన్‌ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, జీహెచ్‌ఎంసీ, హెల్త్‌, శానిటేషన్‌ వంటి అత్యవసర శాఖలకు చెందిన ఉద్యోగుల కోసం నగరంలో ప్రత్యేక బస్సులను నడుపే అవకాశాలు ఉన్నాయన్నారు.

సొంత ఊర్లకు.. ప్రయాణం

బుధవారం నుంచి పది రోజూలు లాక్‌డౌన్‌ విధిస్తూ రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నగరంలోని ప్రజలు సొంత ఊర్లకు బయల్దేరారు. ఈ పది రోజూలు కూడా ఊర్లలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పది రోజూల తర్వాత రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను సడలిస్తారా? లేక మళ్లీ పొడిగిస్తారా? అన్న అంశంపై ఇప్పడే స్పష్టత ఉండదు. ఒకవేళ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగితే లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశాలు కూడా ఉన్నట్లు ప్రజలు భావిస్తున్నారు. ఈ సందర్భంగానే ఊర్లకు పోవడానికి నగరంలోని ప్రజలు హుటాహుటీనా ప్రయాణాలకు సిద్ధపడ్డారు. బుధవారం ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సులు రోడ్డపై తిరుగనున్నాయి. ఈ లోగా తమ సొంత ఊర్లకు చేరుకోవాలని భావించారు. ఈ నేపథ్యంలో తమ సొంత ఊర్లకు వెళ్లే బస్సులన్నీ ప్రయాణికులతో కిట కిటలాడుతున్నాయి. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌తో, ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌ ప్రాంతాలన్ని ప్రయాణికుల రద్దీతో నిండిపోయాయి. కొన్ని రూట్లలో ప్రైవేటు బస్సులలో కూడా రద్దీ పెరిగింది. లగ్జరీ బస్సులతో పాటు ఏసీ కోచ్‌లన్నీ ప్రయాణికులతో నిండిపోతున్నాయి. కరీంనగర్‌, సూర్యాపేట, వరంగల్‌, నిజామాబాద్‌కు వెళ్లే మార్గాలన్ని ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు బస్సులతో పాటు కార్లు, ఇతర ప్రైవేటు వాహనాలతో ట్రాఫిక్‌ పెరిగింది.

రైళ్ల రాకపోకలలో ప్రస్తుతంఎలాంటి మార్పులు లేవు..

లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం పరిధిలో రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవు. దీనిపై దక్షిణ మధ్య రైల్వేలోని సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ప్రయాణికులు లేక పోవడం వల్ల రైళ్లకు నష్టం వస్తుందన్న కారణంగా దాదాపు 70 పైగా రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైళ్ల రాకపోకలపై ఎలాంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు లేవని రైల్వే అధికారులు తెలిపారు. అయితే పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన సరుకు రవాణాలో మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా గూడ్స్‌ రైళ్లు నడవనున్నా యని అధికారులు తెలిపారు.