ఏప్రిల్ 1 నుంచి భారత్‌లో లాక్‌డౌన్‌

భారత్‌లో కరోనా మహమ్మారి రోజురోజుకూ ఉధృతరూపం దాలుస్తోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల సమయంలో దాదాపు 44వేల కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్‌ను అదుపులో ఉంచేందుకు ప్రధానమంత్రి మోడీ ఇటీవలే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర, పంజాబ్‌, ఢిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, కేరళ, తెలంగాణలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రతిరోజు నమోదయ్యే కేసుల్లో 60 శాతం మహారాష్ట్రలోనే ఉంటున్నాయి. ఆంద్రప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లోని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా చేద్దామనుకున్నప్పటికీ స్థానికులు వ్యతిరేకించడంతో జోన్లు పెట్టే ఆలోచనను అధికారులు మానుకుంటున్నారు. అధికారికంగా ఒక లెక్క ఉన్నప్పటికీ అనధికారికంగా ఆందోళన కలిగించేస్థాయిలో కేసులు పెరుగుతుండటంపై అందరూ కలవరపాటుకు గురవుతున్నారు. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్‌లో భారత్‌లో లాక్‌డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అయితే ఏప్రిల్ ఒకటోతేదీ నుంచా? రెండోవారం నుంచా? అనేది స్పష్టత రాలేదని చెబుతున్నాయి.