మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ పై ప్రభుత్వ తీరును ఖండించిన లోకం ప్రసాద్

నెల్లిమర్ల: గత వారం రోజులుగా భోగాపురం మండలం మిరకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ సంస్థలో ప్రభుత్వ భూములు ఉన్నా యంటూ ప్రభుత్వ అధికారులు మార్కింగ్ చేయడం, తొలగిస్తామని పదేపదే చెప్పడం ఏవొ కారణాలతో వాయిదా వేయడం జరుగుతోంది. తాజాగా మంగళవారం అధికారులు బలగాలు, జేసీబీ, ట్రాక్టర్లతో, మిరకిల్ సంస్థ వద్దకు ఆర్డీవో సూర్యకళ, తహశీల్దార్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసుల సహకారంతో రెవెన్యూ, అధికారులు సాఫ్ట్వేర్ కంపెనీ వద్దకు చేరుకున్నారు. దీంతో మిరాకిల్ సంస్థ ఉద్యోగులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. కంపెనీ ప్రధాన ద్వారం వద్దకు చేసుకొని రెవెన్యూ సిబ్బంది, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సమీప గ్రామమైన ముంజేరు గ్రామప్రజలు మరియు సమీప ప్రాంతవాసులు ఏకమై అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా లోకం ప్రసాద్ మాట్లాడుతూ మాకు మా సంస్థకు సుమారు 14 ఎకరాలు 95 సెంట్లు ప్రభుత్వం నుండి కొనుగోలు చేసామని, అలాగే ఆ సందర్భంలో సదరు భూముల మధ్య ఇంకను ఉన్న గెడ్డ, వాగు, పోరంబోకు, రస్తాలను ప్రస్తావిస్తూ, ఇవన్నీ మా సంస్థ ఆధ్వర్యంలో ఉంచడానికి గాను గతంలో ఉత్తర్వులు పొందామన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దారు ఆధారాలతో రాత పూర్వకంగా తెలియజేసామన్నారు. అయినప్పటికీ రాజకీయ నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గి ఇలా వ్యవహరించడం విచారకమని ఆవేదన వ్యక్తం చేసారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ పేరుతో ప్రారంభించిన కంపెనీని ఈ ప్రాంతం నుండి తీసివేయడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సంస్థ ఎండి లోకం ప్రసాద్ అన్నారు. మంగళవారం మిరాకిల్ సంస్థకు ఎటువంటి ఇబ్బంది కలకూడదనే కోర్టు నుండి స్టే తెచ్చుకున్న దానిని పట్టించుకోకుండా దౌర్జన్యంగా పోలీసు శాఖ వారు, రెవెన్యూ శాఖ వారు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులను చేస్తున్నారని అన్నారు. ఏదిఏమైనప్పటికీ ఈ ప్రభుత్వ వ్యతిరేక భావన తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనికోసం ఎంతవరకైనా వెళతామని ఆయన అన్నారు. మంగళవారం రెవెన్యూ డివిజన్ అధికారి సూర్య కళ మిరాకిల్ సంస్థల వద్దకు రాగా లోపలకు రానీయకుండా విద్యార్థులు యాజమాన్యము గేటు మూసి వేయగా పోలీసుల చొరవతో మరలా గేటు తీశారు. సుమారు 14.22 ఎకరాల ప్రభుత్వ భూమి మిరాకిల్లో ఉందంటూ రెవెన్యూ అధికారులు ఇటీవల బోర్డులు ఏర్పాటు చేశారు. వీటిని స్వాధీనం చేసుకోవడానికి ఎక్స్కవేటర్లు, పోలీసులను తీసుకుని తహసీల్దార్ కె.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది మంగళవారం మిరాకిల్ వద్దకు వెళ్లారు. వీరిని లోపలకు రానివ్వకుండా విద్యార్థులు, ఉద్యోగులు అడ్డుకున్నారు. ఆర్డీవో సూర్యకళ వచ్చిన తర్వాత లోపలకు వెళ్లారు. మిరాకిల్ సంస్థ సీఈవో, జనసేన నాయకుడు ప్రసాదులోకం మాట్లాడుతూ కోర్టు నుంచి స్టేఆర్డర్ తీసుకొచ్చామంటూ చూపించారు. దీన్ని పరిశీలించిన ఆర్డీవో తాము న్యాయస్థానాన్ని గౌరవిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. అనంతరం ఆర్డీవో తహసీల్దారు సూచనలు ఇవ్వడంతో సిబ్బంది రోడ్లను కొన్ని నిర్మాణాలను యంత్రాలతో తొలగించారు. మిరాకిల్ సీఈవో ఇదంతా రాజకీయ కక్షతోనే చేస్తున్నారని ఆరోపించారు.