ప్రజల్ని పీడించే నాయకులకు ఆ వినాయకుడు సద్బుద్ది ప్రసాదించాలి

• పవన్ కళ్యాణ్ వినాయక చవితి సందేశం
వినాయక చవితి… అందరూ కలసి మెలసి చేసుకొనే పండుగ అని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తొమ్మిది రోజుల అంగరంగ వేడుకని, ఆధ్యాత్మికత, ఆనందదాయకమైన పండుగ అని ఒక ప్రకటనలో తెలిపారు. ఒకనాడు తెల్లవారిపై పోరాటానికి, హిందువుల సమైక్యతకు ఆలంబనగా నిలిచింది. హిందూయేతర మత విశ్వాసాలను పాటించేవారు కూడా దేశంలోని కొన్ని ప్రాంతాలలో వినాయక ఉత్సవాలలో పాలుపంచుకోవడం, మన హైదరాబాద్ వంటి నగరాలలో నిమజ్జనం సందర్భంలో ముస్లిం సోదరులు మంచి నీరు, అల్పాహారాలు అందించడం వంటివి మన దేశ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయి. ఇంతటి మహత్తరమైన, హిందువుల తొలి పండుగైన వినాయక చతుర్థి సందర్భంగా దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలుగువారందరికీ నా పక్షాన, జనసేన పక్షాన భక్తిపూర్వక శుభాకాంక్షలు.
ఈ పండుగలో మట్టి వినాయకులనే పూజించమని నా మనవి. దీనివల్ల సంప్రదాయాన్ని పాటించినవారమవుతాం. దానితోపాటే పర్యావరణానికి మేలు చేసిన వారమూ అవుతాం. ప్రజలందరికీ శుభాలు కలుగచేయాలని, పాలన మాటున ప్రజలను పీడించే నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ విఘ్నాధిపతిని మనసారా ప్రార్ధిస్తున్నాను అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *