మద్దాలి గిరి గారూ..! జనసేన పార్టీకి మద్దతు ఇస్తే రోడ్డు వేయరా?

  • పాములతో సహవాసం చేస్తున్నాం అన్నా కనికరం లేదా?
    కులం చూడం … మతం చూడం … పార్టీ చూడం…ప్రాంతం చూడం అంటారుగా మరి ఈ ద్వందరీతి ఏమిటి?
  • అభివృద్ధి చేయనప్పుడు జనసేన వాళ్ళు పన్నులు ఎందుకు కట్టాలి?
  • గెలిచాక ప్రజలందరూ సమానమని తెలియదా? ఈ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
  • ఈ ప్రాంతంలో ప్రజలు తిరగబడతారని తెలిసే గడప గడపకు రాలేదా?
  • వైసీపీ నాయకులపై ప్రజలకు నమ్మకం పోయింది
  • కమీషనర్ తమరన్నా శ్రద్ధ తీసుకొని సమస్యల్ని పరిష్కరించండి
  • జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, జనసేన పార్టీకి మద్దతు ఇచ్చారన్న నెపంతో శంఖుస్థాపన చేసిన రోడ్డుని సైతం నిర్మించకుండా నిలిపివేయడం దారుణమని , జనసేనకు మద్దతు ఇస్తే రోడ్డు వేయరా అంటూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యుడు మద్దాలి గిరిని, స్థానిక కార్పొరేటర్ గేదెల నాగరంగమణి రమేష్ ని గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ప్రశ్నించారు. తాము గత ఎన్నికల్లో జనసేనకు ఓటు వేశామన్న కోపంతో రోడ్డు నిర్మాణం చేపట్టలేదని 22 వ డివిజన్లోని జానీ కాలనీ వాసులు ఆదివారం జనసేన పార్టీ నేతల వద్ద తమ గోడుని వినిపించుకున్నారు. ఇక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లోంచి పాములు ఇళ్లలోకి వస్తున్నాయని, ఏ క్షణాన ఏమి జరుగుతోందో అన్న భయంతో రోజులు గడుపుతున్నామని స్థానికులు తెలిపారు. ఈ రోడ్డు విషయమై స్థానిక శాసనసభ్యులు మద్దాలి గిరిని, కార్పొరేటర్ ని పలుమార్లు కలిసినా ఉపయోగం లేకపోగా మీరందరూ జనసేన అంటూ మాట్లాడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ కులం చూడం ,మతం చూడం , పార్టీ చూడం, ప్రాంతం చూడం అంటూ వైసీపీ నేతలు చెప్పే నీతులన్నీ మాటలకే పరిమితమని విమర్శించారు. ఎన్నికల అనంతరం ప్రజలందరినీ సమానంగా చూడాలన్న బుద్ధి వైసీపీ నేతలకు లేకపోవటం శోచనీయమన్నారు. ఈ ప్రాంతంలో పాములు తిరుగుతున్నాయని ప్రజలు మొత్తుకున్నా వైసీపీ నాయకులకు కనీసం చలనం లేకపోవటం హేయమన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలే సొంత నిధులతో విద్యుత్ స్తంభాలను ఏర్పరచుకున్నారని అలాంటిది ఇక్కడ రోడ్డు కూడా నిర్మించలేని స్థితిలో పాలకులున్నారని దుయ్యబట్టారు. సైడ్ కాలువలు లేకపోవడంతో ఎక్కడ మురుగు అక్కడే నిలిచిపోయి విపరీతమైన దుర్గంధంతో పాటూ దోమలతో నరకయాతన పడుతున్నా కార్పొరేటర్ ఇటువైపు కన్నెత్తి చూడకపోవటం సిగ్గుచేటన్నారు. స్థానికులు సమస్యలపై నిలదీస్తారనే వైసీపీ నేతలు గడప గడపకు ఇటువైపుకి రాలేదని విమర్శించారు. నగర అభివృద్ధిపై తమ అసమర్ధతను, చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే జనసేన పార్టీని భూతంగా చూపిస్తున్నారని మండిపడ్డారు. జనసేన పార్టీ సానుభూతిపరులు ఉన్న ప్రాంతాల్ని అభివృద్ధి చేయనప్పుడు వాళ్ళ దగ్గర ఎందుకు పన్నులు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులపై ప్రజలకి నమ్మకం పోయిందని ఈ నేపధ్యంలో నగరపాలక సంస్థ కమీషనర్ చేకూరి కీర్తి అన్నా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని స్థానిక సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ఇక్కడ నెలకొన్న సమస్యల్ని యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజలతో కలిసి కార్పోరేషన్ ని ముట్టడిస్తామని ఆళ్ళ హరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్, రామిశెట్టి శ్రీనివాసరావు, నండూరి స్వామి, ఇళ్ల తిరుపతిరావు, ఇల్లా చిరంజీవి, ఉప్పు సుబ్బారావు, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు.