కరోనా వచ్చిందంటూ మాధవన్ ఫన్నీ పోస్ట్!

‘త్రీ ఇడియట్స్’ చిత్రంలో ఆమిర్ ఖాన్, మాధవన్, శర్మాన్ జోషీ టైటిల్ రోల్స్ పోషించారు. తెలివైన విద్యార్థి ఆమిర్ ఖాన్ వెనకే మాధవన్, శర్మాన్ జోషీ పడుతుంటారు. జీవితంలో తమ కాళ్ళ మీద తాము నిలబడటమే కాదు… నచ్చిన వృత్తిని ఎంచుకోమంటూ ఆమిర్ ఖాన్ వీళ్ళను మోటివేట్ చేస్తాడు. తాజాగా ఆమిర్ ఖాన్ కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. చిత్రం ఏమంటే… ఇప్పుడు ఈ కరోనా మాధవన్ ను కూడా సోకింది. కరోనా బారిన పడిన మాధవన్ ఆ విషయాన్ని ఫన్నీగా తెలియచేశాడు. సోషల్ మీడియాలోని తన అక్కౌంట్ లో ‘త్రీ ఇడియట్స్’ ఫోటోను పెడుతూ, ‘రాంచో (ఆమిర్ ఖాన్)ను ఫర్హాన్ (మాధవన్) ఫాలో అయ్యాడు. కరోనా మా వెంట పడినా… ఈసారి దొరికిపోయాం. ఆల్ ఈజ్ వెల్… ఈసారి కరోనా మా రాజు (శర్మాన్ జోషీ)ని చేరకూడదని కోరుకుంటున్నాను. నేను కూడా త్వరగానే కోలుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి కరోనా బారిన పడిన మాధవన్ సెన్సాఫ్ హ్యూమర్ కు నెటిజన్స్ నమస్కారం పెడుతున్నారు.